Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సందిగ్ధం నెలకొంది. అసలు ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా? ఉండవా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందా? అనే విషయాలపై గ్రామాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే స్థానిక స్థానిక సంస్థల గడువు ముగిసినందున సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను పాత విధానంలో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది. అయితే, రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినపుడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేని పక్షంలో ఎన్నికల సంఘం ఆ దామాషా ప్రకారం సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చంటూ రాహుల్ రమేశ్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఆ తీర్పును అనుసరించి రాష్ర్టం ఇవ్వాలనుకున్న రిజర్వేషన్ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లతో పాటు, ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది.
50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు..
ఆ తీర్పుకు సంబంధించి ధర్మాసనం విడుదల చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి వివరాలు శుక్రవారం అర్థరాత్రి అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం.. వికాస్ కిషన్‌రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవో 9, 41, 42లను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదని, ఎన్నికలకు పాతవిధానంలో ముందుకు వెళ్లవచ్చని సూచించింది. రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికి మించరాదని తేల్చి చెప్పింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే, ట్రిపుల్ టెస్ట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై సర్వే నిర్వహించామని, దానికి ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పరిమితి అన్నది ఖచ్చితమైన నియమం కాదని, సవరించుకునే వెసులుబాటు ఉందని ప్రభుత్వం తన వాదన వినిపించింది.ఈ వాదనను సమర్థిస్తూ ఇంద్ర సహానీ, జన్‌హిత్ అభియాన్ కేసులను ప్రభుత్వం ప్రస్తావించింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడినవారికి 10 శాతం రిజర్వేషన్‌లు కల్పించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. ఎం.ఆర్.బాలాజీ కేసులో 50 శాతం పరిమితి తప్పనిసరికాదని, వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని ప్రభుత్వం గుర్తు చేసింది. అదే సమయంలో రాజ్యాంగంలోని అధికరణ 243ఓ ప్రకారం సెప్టెంబరు 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో కోర్టు ఎలాంటి జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియను కోర్టు నిలిపివేయలేదని స్పష్టత ఇచ్చింది. 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.


