TG Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరగున్నాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ హైకోర్టు ప్రశ్నించడంతో దీనికి సంబంధించిన బిగ్ అప్‌డేట్ వస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సమస్య నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిల్చిపోయాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కొత్త రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నించడంతో హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించిన హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే కారణంతో వాటిపై స్టే ఇచ్చింది. పాత రిజర్వేషన్ల ప్రకారమైతే ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొత్త రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే సుప్రీంకోర్టులో సైతం తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పిటీషన్ కొట్టివేసింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది.
అంటే బీసీ రిజర్వేషన్లపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని అడిగి చెబుతామంటూ గడువు కోరింది. హైకోర్టు రెండు వారాల గడువిచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపధ్యంలో స్థానిక ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ మొదటి వారంలో మరో విడత రైతు బంధు విడుదల చేసి డిసెంబర్ చివరి లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం


