Telangana local body elections voter list : గ్రామ గ్రామాన ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, అత్యంత కీలకమైన ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. మీ ఓటు హక్కు భద్రంగా ఉందా? జాబితాలో మీ పేరు సరిగ్గానే నమోదైందా..? లేక గల్లంతైందా..? ఈ కీలకమైన సమాచారాన్ని మీరు మీ అరచేతిలోనే, ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. అసలు ఈ జాబితాను ఎలా చూసుకోవాలి..? పేరు లేకపోతే ఏం చేయాలి..?
సిద్ధమైన తుది జాబితా : రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం పకడ్బందీగా ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఆగస్టు 28న ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు.
ఈ అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసిన అనంతరం గ్రామ పంచాయతీలకు సంబంధించి సెప్టెంబర్ 2న, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి సెప్టెంబర్ 10న తుది ఓటరు జాబితాలను ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగానే త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
మీ పేరు చూసుకోవడం ఇంత సులభం : రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను అందరికీ అందుబాటులో ఉంచింది. కింద చెప్పిన విధంగా మీరు సులభంగా మీ పేరును చూసుకోవచ్చు.
వెబ్‌సైట్ ఓపెన్ చేయండి: మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో గూగుల్‌లోకి వెళ్లి tsec.gov.in అని టైప్ చేసి, అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
సరైన ఆప్షన్ ఎంచుకోండి: హోమ్‌పేజీలో కనిపించే ‘ఫైనల్ రోల్స్ – జీపీ/వార్డు వైజ్ ఓటరు లిస్ట్’ (Final Rolls – GP/Ward wise Voter List) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
వివరాలు నమోదు చేయండి: ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ , మండలం, గ్రామ పంచాయతీ వివరాలను ఎంచుకుని, కింద కనిపించే క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో సరిగ్గా ఎంటర్ చేయండి.
జాబితా డౌన్‌లోడ్: వెంటనే, మీ గ్రామానికి సంబంధించిన పూర్తి ఓటరు జాబితా వార్డుల వారీగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కనిపిస్తుంది. దానిని మీరు చూసుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబితాలో మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీరు ఏ వార్డు పరిధిలోకి వస్తారు, ఎక్కడ ఓటు వేయాలి వంటి పూర్తి వివరాలు ఉంటాయి.
నిర్లక్ష్యం వద్దు.. పేరు లేకపోతే ఏం చేయాలి : ఓటు హక్కు మన బాధ్యత మాత్రమే కాదు, మన హక్కు కూడా. కాబట్టి, జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోయినా, లేదా పేరులో తప్పులు దొర్లినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. వెంటనే మీ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని (MRO ఆఫీస్) సంప్రదించి, అవసరమైన ఫారాలు పూర్తి చేసి, మీ వివరాలను సరిచేసుకోవచ్చు లేదా కొత్తగా నమోదు చేసుకోవచ్చు.
ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు తమ పేరు జాబితాలో ఉండేలా చూసుకోవడం అత్యవసరం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, మీ ఓటు హక్కును వినియోగించుకోండి.


