Saturday, November 15, 2025
HomeతెలంగాణSocial media : గల్లీ పోరు.. హైటెక్ హోరు! సోషల్ మీడియాలో హద్దు మీరితే కేసులే!

Social media : గల్లీ పోరు.. హైటెక్ హోరు! సోషల్ మీడియాలో హద్దు మీరితే కేసులే!

Social media monitoring during elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఒకప్పుడు రచ్చబండలు, గ్రామ కూడళ్లలో జరిగే పంచాయితీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు చేరింది. వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలే ఎన్నికల ప్రచార క్షేత్రాలుగా మారాయి. అయితే, ఈ డిజిటల్ ప్రచారంలో శ్రుతి మించితే ఏమవుతుంది? వ్యక్తిగత దూషణలకు, రెచ్చగొట్టే పోస్టులకు పాల్పడితే ఎలాంటి చర్యలు తప్పవు? ఈ హైటెక్ పోరుపై పోలీసుల నిఘా ఎలా ఉంది?

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ బరిలో నిలవాలనుకునే ఆశావహులు, వారి అనుచరులు సామాజిక మాధ్యమాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్ వంటి వేదికలపై పోటాపోటీగా పోస్టులు పెడుతూ మాటల యుద్ధానికి తెరలేపారు. “మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. ఆశీర్వదించండి” అంటూ వీడియోలు, ఫొటోలతో కూడిన సందేశాలు గ్రామ, మండల గ్రూపుల్లో హోరెత్తుతున్నాయి.

అయితే, ఈ డిజిటల్ ప్రచారంలో కొందరు హద్దులు మీరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంచి ఆలోచనలను పంచుకునే వేదికలు, వ్యక్తిగత దూషణలకు, అసత్య ప్రచారాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫొటోల మార్ఫింగ్, వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ.. కొన్ని ఉదాహరణలు:
రూ.50 లక్షల ఆఫర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఓ వ్యక్తి, తనను సర్పంచిగా ఏకగ్రీవం చేస్తే గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.50 లక్షలు డిపాజిట్ చేస్తానంటూ గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ పెట్టడం కలకలం రేపింది.

వ్యక్తిగత దూషణలు: వనపర్తి జిల్లాకు చెందిన ఓ మండల గ్రూపులో, ఓ పార్టీ రాష్ట్ర నేతకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడంతో, గ్రూప్ అడ్మిన్ జోక్యం చేసుకుని చర్చను నిలిపివేయాల్సి వచ్చింది.

బహిర్గతమైన వర్గవిభేదాలు: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఓ గ్రామ గ్రూపులో, తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఓ వ్యక్తి పోస్ట్ చేయగా, అదే పార్టీకి చెందిన మరో వర్గం ఆయనకు సహకరించవద్దని అదే గ్రూపులో స్పష్టం చేయడం పార్టీలోని విభేదాలను బట్టబయలు చేసింది.

ఆదర్శ ప్రచారం: మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లాలో కొందరు యువకులు, “ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయొద్దు, ఓటుకు నోటు అడగొద్దు” అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆదర్శవంతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు.

హద్దు మీరితే చర్యలు తప్పవు: ఎస్పీ రావుల గిరిధర్‌ : సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ స్పష్టం చేశారు. “గత ఎన్నికల సమయంలో విద్వేషపూరిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేశాం. వారిని ఇప్పుడు బైండోవర్ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో హద్దులు మీరితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కఠిన కేసులు నమోదు చేస్తాం,” అని ఆయన హెచ్చరించారు. అభ్యంతరకర పోస్టులు పెట్టి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, వాట్సాప్ గ్రూపుల అడ్మిన్‌లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad