Severe malnutrition and anemia in Telangana : పళ్లెంలో అన్నం, కూర ఉంటాయి. కానీ మన శరీరానికి కావలసిన శక్తి అందుబాటులో ఉందా అనేది ప్రశ్నగా ఉంది. రోజూ కడుపు నిండా తింటున్నా నీరసం ఎందుకు వస్తోంది..? చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎందుకు రక్తహీనతతో కునారిల్లుతున్నారు? తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2025 విడుదల చేసిన గణాంకాలు ఈ ప్రశ్నలకు నిలువుటద్దం పడుతూ, మన ఆహారపు అలవాట్లపై, ఆరోగ్య వ్యవస్థలోని లోపాలపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పే నిపుణుల కొరత ఈ సంక్షోభాన్ని మరింత జఠిలం చేస్తోంది. అసలు ఈ దుస్థితికి కారణం ఎవరు..? మనల్ని సరైన దారిలో పెట్టాల్సిన మార్గదర్శకులు ఏమయ్యారు..?
నివ్వెరపరిచే నిజాలు.. గణాంకాల ఘోష : తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2025 ప్రకారం, రక్తహీనత ప్రగతి సూచిలో అనేక జిల్లాలు వెనుకబడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్ (82.7%), పెద్దపల్లి (70.7%), సిరిసిల్ల (63%) జిల్లాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది.
చిన్నారుల దుస్థితి: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 1,79,510 మంది ఉండగా, వారిలో 13,892 మంది (7.73%) తీవ్ర పోషణ లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నారని పోషకాభియాన్ గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం 10.7%గా ఉన్న ఈ సంఖ్య తగ్గడం కొంత ఊరటనిచ్చినా, ప్రస్తుత పరిస్థితి ప్రమాదకర స్థాయిలోనే ఉంది.
సమస్య మూలం – మార్గదర్శకులు కరవు : ఈ పోషకాహార లోపానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం. ఈ అవగాహన కల్పించాల్సిన పోషకాహార నిపుణులు (డైటీషియన్లు) ప్రభుత్వ ఆసుపత్రుల్లో దివిటీ పెట్టి వెతికినా దొరకడం లేదు.
ఖాళీ పోస్టులు: జాతీయ పోషకాహార సంస్థ నిబంధనల ప్రకారం, ప్రతి 50 పడకల ఆసుపత్రికి ఒక డైటీషియన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, జిల్లా ఆసుపత్రుల్లో ఈ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్క కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే ఒప్పంద పద్ధతిపై ఒకరు పనిచేస్తున్నారు.
భారీ కొరత: ప్రతి మండలానికి ఒకరు, పురపాలికలకు 5 నుంచి 10 మంది చొప్పున నిపుణులు అవసరం. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు సుమారు 135 మంది నిపుణులు అవసరం కాగా, ఉన్నది ఒక్కరు మాత్రమే. ఇదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం అర్హత కలిగిన డైటీషియన్లు సేవలందిస్తున్నారు.
మొక్కుబడి తంతుగా ‘పోషణ మాసోత్సవాలు’ : ప్రతి ఏటా సెప్టెంబరు 1 నుంచి 7 వరకు ప్రభుత్వం జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తుంది. పోషకాహారం ప్రాధాన్యంపై వైద్యారోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ, నిపుణులే లేకపోవడంతో ఈ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో కేవలం మొక్కుబడిగా, అక్కడక్కడా ఫొటోలకు మాత్రమే పరిమితమవుతున్నాయి.
ఆరోగ్యానికి అసలైన మార్గం ఇదే : “ప్రజలు ఆరోగ్య పిరమిడ్‌కు పూర్తిగా భిన్నమైన ఆహారం తీసుకుంటూ అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు,” అని పోషకాహార నిపుణురాలు సాయిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సూచనల ప్రకారం.
సరైన నిష్పత్తి: మన భోజనంలో 50% తృణధాన్యాలు, పప్పులు; 40% ఆకుకూరలు, పండ్లు; కేవలం 5 నుంచి 10% మాత్రమే తీపి పదార్థాలు, నూనెలు ఉండాలి. కానీ, వాస్తవంలో తీపి, నూనె పదార్థాలనే అధికంగా తీసుకుంటున్నాం.
జంక్‌ఫుడ్‌కు దూరం: పిల్లలకు జంక్ ఫుడ్, నిల్వ పదార్థాలు పెడుతూ వారి ఆరోగ్యాన్ని తల్లిదండ్రులే చేతులారా పాడుచేస్తున్నారు.
చౌకగా, బలంగా: రాగి జావ, పాలు, పల్లీలు, గుడ్లు, నువ్వుల పట్టీలు వంటి ఆహారాలు తక్కువ ధరలో లభించే అత్యుత్తమ బలవర్ధకాలు. ప్రతి ఒక్కరూ ఏం తినాలి, ఎంత తినాలి అనే స్పృహతో సమతుల ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది.


