Hyderabad Drugs: హైదరాబాద్‌లోని చర్లపల్లి ప్రాంతంలో ముంబై పోలీసులు భారీ డ్రగ్స్ కేసును ఛేదించి, పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ తయారీ, సరఫరా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసు వివరాలను పరిశీలించిన మంత్రి, చర్లపల్లి డ్రగ్స్ తయారీ కేంద్రంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆ ఫ్యాక్టరీని పరిశీలించి, 24 గంటల్లోగా సమగ్ర నివేదిక అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై మరింత పటిష్టమైన నిఘా పెట్టాలని ఆయన అన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని, ఈ వ్యవహారంలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరిక అని, యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం రాజీపడదని, మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


