Thummala: తెలంగాణ పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇటీవల విధించిన కఠినమైన నిబంధనలను తక్షణమే సడలించాలని కోరుతూ ఆయన కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాలకు లేఖ రాశారు.
క్వింటాళ్ల పరిమితిపై రగడ
సీసీఐ కొత్తగా తీసుకొచ్చిన ‘ఎకరాకు 7 క్వింటాళ్ల’ పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధనపై మంత్రి తుమ్మల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ల నివేదికల ఆధారంగా కూడా రాష్ట్రంలో ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల పత్తి దిగుబడి ఉన్నట్లు డిక్లరేషన్ ఇచ్చామని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఈ కొత్త పరిమితి రైతులపై తీవ్ర నష్టాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తేమ శాతం, యాప్‌పై సడలింపు కోరిన మంత్రి
ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడం వల్ల పత్తి పంట దెబ్బతిన్నదని, ఈ పరిస్థితుల్లో సీసీఐ కఠిన నిబంధనలు పాటించడం సరికాదని తుమ్మల అన్నారు. సాధారణంగా 12% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు నిలిపివేస్తున్నారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, తేమ శాతం 20% వరకు ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. పత్తి అమ్మకాలకు తప్పనిసరి అయిన ‘కపాస్ కిసాన్ యాప్’పై రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డుగా మారుతోందని మంత్రి తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు ఈ నిబంధనలను ఎత్తివేసి, పాత పద్ధతిలో కొనుగోళ్లను కొనసాగించాలని, అలాగే జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం త్వరగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.


