Telangana new ration card benefits : కొత్త రేషన్ కార్డు చేతికొచ్చినా.. బియ్యం ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారా? మీ పదేళ్ల నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. ఈ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందిన లక్షలాది మందికి ప్రజాపంపిణీ బియ్యం అందనున్నాయి. దీంతో లబ్ధిదారుల ఇళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. మరి ఈ పంపిణీ ప్రక్రియ ఎలా జరగనుంది..? ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త సంచుల కథేంటి..?
పదేళ్ల నిరీక్షణకు స్వస్తి : గత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్తంభించిపోయింది. కుటుంబంలో సభ్యులు పెరిగినా, కొత్త కోడలు అత్తారింటికి వచ్చినా వారి పేర్లను కార్డులో చేర్చే అవకాశం లేకపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా అర్హులను గుర్తించి, ఈ ఏడాది ఆరంభం నుంచి విడతల వారీగా కొత్త కార్డులను మంజూరు చేస్తోంది. ఒక్క కరీంనగర్ పట్టణంలోనే కొత్తగా 37,147 కార్డులు మంజూరు చేసి, 73,987 మంది కొత్త సభ్యులను చేర్చారంటే ఈ ప్రక్రియ ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
గత మూడు నెలలుగా ఎదురుచూపు : వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో పాత కార్డుదారులకు మూడు నెలల (జూన్, జులై, ఆగస్టు) కోటాను ఒకేసారి పంపిణీ చేసింది. అయితే, ఆ సమయానికి కొత్తగా కార్డులు పొందిన వారికి సాంకేతిక కారణాల వల్ల బియ్యం అందలేదు. దీంతో గత మూడు నెలలుగా వారు తమ వాటా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఈ నెల నుంచి పంపిణీ : సెప్టెంబర్ నెల కోటాను పాత, కొత్త కార్డుదారులందరికీ కలిపి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా పూర్తయింది. సోమవారం కొన్ని చోట్ల ప్రారంభమైన పంపిణీ, మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాల్లోనూ జరగనుంది. కొత్త కార్డుదారులు ఎలాంటి అపోహలకు గురికాకుండా తమ బియ్యం తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.
‘అభయహస్తం’ సంచులు ప్రత్యేకం : ప్రజాపంపిణీ వ్యవస్థలో తనదైన ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల నుంచే లబ్ధిదారులకు పర్యావరణహితమైన బట్ట సంచులను ఉచితంగా అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన ‘అభయహస్తం’ చక్రం, ఇందిరమ్మ చిత్రంతో పాటు సీఎం, ఉప ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలతో ఈ సంచులను ఆకర్షణీయంగా ముద్రించినట్లు సమాచారం.


