తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అనగా..2023 జనవరి నెలలో కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 18వ తేదీన సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం బ్లాక్ ను కేసీఆర్ ప్రారంభించనున్నారట. ఆ రోజు నుండి సీఎం ఛాంబర్ నుండి కేసీఆర్ పాలన కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సచివాలయ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారవ్వడంతో.. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం.. నిర్మాణ పనుల విషయంలో అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ఇంటీరియర్, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ స్మృతి వనం పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.
వచ్చే ఏడాది నగరంలో జరగనున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలకు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం పనులు అసంపూర్తిగా కనిపించొద్దని, రేసింగ్ పోటీల లోపే పనులు పూర్తికావాలని ప్రభుత్వం నిర్ణయించింది.