Friday, December 12, 2025
HomeతెలంగాణPanchayat Elections: పల్లె పోరుకు పక్కా గుర్తులు: సర్పంచ్‌కు 30.. సభ్యులకు 20!

Panchayat Elections: పల్లె పోరుకు పక్కా గుర్తులు: సర్పంచ్‌కు 30.. సభ్యులకు 20!

Telangana local body election symbols : చెప్పులు, చెత్త డబ్బా, టీ జల్లెడ… ఇవేంటి వంటగదిలోని వస్తువుల జాబితా అనుకుంటున్నారా? కానే కాదు! తెలంగాణ పల్లెల్లో ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించబోయే అధికారిక చిహ్నాలివి. పల్లెల్లో ఎన్నికల నగారా మోగడంతో సందడి వాతావరణం నెలకొంది. 

- Advertisement -

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుండగా, పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. గురువారం నుంచే తొలివిడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నవంబరు 30వ తేదీతో నామపత్రాల దాఖలుకు గడువు ముగియనుండగా, డిసెంబర్ 11న మొదటి విడత పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండటంతో, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అత్యంత కీలకమైన ప్రక్రియగా మారింది.

పార్టీలకు అతీతం.. అందుకే ఈ గుర్తులు : శాసనసభ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగా కాకుండా, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీ గుర్తుపైనా జరగవు. దీనివల్ల ఓటర్లలో ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థులకు స్వేచ్ఛా గుర్తులను కేటాయిస్తుంది. గ్రామీణ ప్రజలకు సులువుగా పరిచయమున్న, నిత్యజీవితంలో చూసే వస్తువులనే గుర్తులుగా ఎంపిక చేస్తారు. దీనివల్ల అక్షరాస్యతతో సంబంధం లేకుండా ప్రతి ఓటరు తమకు నచ్చిన అభ్యర్థి గుర్తును సులభంగా గుర్తించి ఓటు వేయడానికి వీలవుతుంది.

గుర్తుల కేటాయింపు.. విధివిధానాలు : తుది నామినేషన్ల పర్వం ముగిసి, బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో తేలిన తర్వాత, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి గుర్తులను కేటాయిస్తారు. ఓటరు సులభంగా గుర్తించేందుకు వీలుగా సర్పంచి, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను, వాటిపై ముద్రించే గుర్తులను వేర్వేరు రంగుల్లో ముద్రిస్తారు.

సర్పంచి అభ్యర్థులకు (30 గుర్తులు): సర్పంచి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 30 గుర్తులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. వీరి బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో ఉంటుంది. ఆ గుర్తులు ఇవే:
ఉంగరం, కత్తెర, బ్యాట్, టూత్‌పేస్టు, పానా (స్పానర్‌), చెత్తడబ్బా, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, మనిషి, తెరచాపతో ఉండే పడవ, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌ హ్యాండిల్, టీజల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బిస్కట్, వేణువు, చెయిన్‌(గొలుసు), చెప్పులు, గాలిబుడగ, స్టంప్స్‌.

వార్డు సభ్యుల అభ్యర్థులకు (20 గుర్తులు): వార్డు సభ్యుల కోసం 20 విభిన్నమైన గుర్తులను కేటాయించారు. వీరి బ్యాలెట్ పత్రం తెలుపు రంగు కాగితంపై ముద్రించబడుతుంది. ఆ గుర్తులు ఇవే:
గౌను, కటింగ్‌ ప్లేయర్, గ్యాస్‌పొయ్యి, గ్యాస్‌ సిలిండర్, స్టూల్, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టుడబ్బా, కవరు, హాకీ కర్రబంతి, నెక్‌టై, పెట్టె, విద్యుత్తు స్తంభం, కెటిల్‌.

ఓటరుకు అదనపు సౌకర్యాలు, హెచ్చరికలు :
నోటాకు చోటు: బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చని పక్షంలో, తమ నిరసనను తెలిపేందుకు ఓటర్లకు ‘నోటా’ (None of the Above) అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించింది. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల గుర్తులన్నింటి తర్వాత చివరగా నోటా గుర్తును ముద్రిస్తారు.

సాంకేతిక సౌలభ్యం: ఓటర్లు తమ ఓటర్ స్లిప్పులను సులభంగా పొందేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ‘Te-poll’ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్లేస్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా ఈ యాప్‌ ద్వారా చేసి, వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు.

బలవంతపు ఏకగ్రీవాలపై ఉక్కుపాదం: కొన్ని గ్రామాల్లో పదవులను వేలం వేయడం, ప్రజలను భయపెట్టి బలవంతంగా ఏకగ్రీవాలు చేయడం వంటివి చట్టవిరుద్ధమని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల వంటి అంశాలపై దాఖలయ్యే న్యాయపరమైన పిటిషన్లను ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టరేట్‌లో ప్రత్యేక న్యాయవిభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News