Telangana panchayat election twist : ఊరంతా ఏకమైంది.. ఓ మహిళను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.. ఇక గెలుపు లాంఛనమేనని ఆమె సంబరపడింది.. కానీ, కథ అడ్డం తిరిగింది! ఏకగ్రీవమన్న ధీమాతో ఆమె నామినేషన్ వేయకపోవడంతో, చివరి నిమిషంలో మరో మహిళ బరిలోకి దిగి, పోటీ లేకుండానే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ విచిత్ర ఘటన, స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కథలో ఏం జరిగింది? ఏకగ్రీవ ఒప్పందం ఏమైంది?
జోగులాంబ గద్వాల జిల్లా, ఈడిగొనిపల్లి గ్రామస్థులు, స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సరస్వతి అనే మహిళను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా, గ్రామంలోని అంజన్న దేవాలయానికి వెళ్లే దారి నిర్మాణానికి సరస్వతి రూ.9.85 లక్షలు విరాళంగా ఇచ్చేలా ఊరి పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా, సరస్వతి వెంటనే రూ.1 లక్ష అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని, సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశాక ఇస్తానని ఒప్పుకున్నారు.
సంబరం కొంపముంచింది : ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాననే సంబరంలో, సరస్వతి అసలు విషయాన్నే మరిచిపోయారు. ఊరంతా తన వెంటే ఉందని, ఇక నామినేషన్ వేసినా, వేయకపోయినా తానే సర్పంచ్‌ననే ధీమాతో ఆమె నామినేషన్ దాఖలు చేయలేదు.
చివరి నిమిషంలో ‘రాణి’ ఎంట్రీ: ఇదే అదనుగా, అదే గ్రామానికి చెందిన రాణి అనే మరో మహిళ, నామినేషన్ల గడువు ముగిసే చివరి నిమిషంలో, సర్పంచ్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు.
ఏకగ్రీవంగా రాణి: ఉపసంహరణ గడువు ముగిశాక, అధికారులు పరిశీలించగా, సర్పంచ్ పదవికి రాణి ఒక్కరి నామినేషనే దాఖలు కావడంతో, ఆమెను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
బాధితురాలి ఆవేదన : ఈ అనూహ్య పరిణామంతో, సరస్వతి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
“గ్రామ పెద్దలే మమ్మల్ని మోసం చేశారు. రూ.9.85 లక్షలకు వేలం పాడి, నా భార్యను ఏకగ్రీవం చేస్తామని తీర్మానం చేశారు. మేం నామినేషన్ వేస్తానంటే వద్దన్నారు. తర్వాత, మాట తప్పి వేరొకరితో నామినేషన్ వేయించారు. పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను, నాకు న్యాయం చేయాలి.”
– రాఘవేంద్ర, సరస్వతి భర్త
ఈ ఘటన, ఏకగ్రీవ ఒప్పందాల వెనుక ఉన్న లొసుగులను, రాజకీయ చదరంగాన్ని మరోసారి బయటపెట్టింది. డబ్బు చెల్లించింది ఒకరైతే, రూపాయి ఖర్చు లేకుండా ‘లక్కీ సర్పంచ్’ అయ్యింది మరొకరు అంటూ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

