Social media campaign for Panchayat elections : “ఓడిపోయినా పర్లేదు, కానీ ఓట్లు చీల్చి, అధికారం అవినీతి చేతికి రానియ్యకు తమ్మీ!” – ఇది రాబోయే పంచాయతీ ఎన్నికల సమరంలో, సోషల్ మీడియాలో మార్మోగుతున్న ఓ నినాదం. మైకుల హోరుకు, ఫ్లెక్సీల మోతకు ఏమాత్రం తగ్గకుండా, వాట్సాప్ స్టేటస్‌లు, ఫేస్‌బుక్ పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో డిజిటల్ ప్రచారం హోరెత్తుతోంది. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో, ఇక రెండో, మూడో విడతలపై అందరి దృష్టి పడింది.
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 3,834 గ్రామాల్లో సర్పంచ్, 27,678 వార్డు సభ్యుల భవితవ్యం తేలిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి, రాబోయే రెండో, మూడో విడత ఎన్నికలపైనే ఉంది. అభ్యర్థులు సంప్రదాయ ప్రచార మార్గాలను అనుసరిస్తుంటే, యువత మాత్రం సోషల్ మీడియాను తమ ప్రచార ఆయుధంగా మలుచుకుంది.
డిజిటల్ పంచాయితీ.. వైరల్ అవుతున్న పోస్టులు : వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఓటు విలువను, సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ, సృజనాత్మక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
లక్షలు ఖర్చు :”నెలకు రూ.10,000 జీతం కూడా రాని సర్పంచి పదవికి లక్షలు ఖర్చు చేస్తున్నాడంటే, నీ ఊరికి ఎంత పెద్ద గాలం వేశాడో చూడు తమ్ముడూ!”
హెచ్చరికలు: “వాడు పోసిన మందు కిక్కు తెల్లారే వరకే, వాడు గెలిచి చేసే అవినీతి ఐదేళ్లు ఉంటుంది. ఆలోచించి ఓటు వేయ్!”
హితబోధ: “గెలిచినవాడు సర్పంచి, ఓడినవాడు పెద్దమనిషి.. మధ్యలో జెండా మోసినోడు ఐదేళ్లు శత్రువులుగా మిగిలిపోతారు. ఊరంతా ఒక్కటే, నచ్చినోడికి నవ్వుకుంటూ ఓటేయండి.”
ప్రముఖుల వ్యాఖ్యలతో ప్రచారం : రాజకీయ నాయకుల వ్యాఖ్యలను కూడా ఓటు చైతన్యం కోసం వాడుకుంటున్నారు. “ఊళ్లలో పంచాయితీలు పెట్టేటోళ్లను గెలిపిస్తే, ఊళ్లు ఆగమైతయ్,” అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాలలోని కొటేషన్లను స్టేటస్‌లుగా పెట్టుకుంటూ, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రచారం చేస్తున్నారు.
యువత చొరవ.. రచ్చబండ వద్ద మీటింగ్‌లు : కొన్ని గ్రామాల్లో యువకులు మరో అడుగు ముందుకేసి, గ్రామ రచ్చబండ వద్ద, సర్పంచ్ అభ్యర్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, “గెలిస్తే ఊరికి ఏం చేస్తారు?” అని నిలదీస్తున్నారు. ఇది గ్రామ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ డిజిటల్, క్షేత్రస్థాయి చైతన్యం, రాబోయే ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

