Sunday, January 18, 2026
HomeతెలంగాణELECTION HIGHLIGHTS : పల్లె పోరులో చిత్రవిచిత్రాలు.. లాటరీతో సర్పంచ్, అంబులెన్స్‌లో వచ్చి ఓటు!

ELECTION HIGHLIGHTS : పల్లె పోరులో చిత్రవిచిత్రాలు.. లాటరీతో సర్పంచ్, అంబులెన్స్‌లో వచ్చి ఓటు!

Telangana panchayat polls : పల్లె పోరు హోరాహోరీగా సాగింది. గెలుపోటముల ఉత్కంఠ నడుమ, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో ఎన్నో చిత్రవిచిత్రమైన, భావోద్వేగభరితమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటుతో గెలుపు తారుమారవడం, లాటరీతో సర్పంచ్‌ను ఎన్నుకోవడం, అంబులెన్స్‌లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకోవడం వంటి ఘటనలు, ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి, పల్లె రాజకీయాలలోని తీవ్రతకు అద్దం పట్టాయి.

- Advertisement -

కొన్ని ఆసక్తికర ఘటనలు…
లాటరీతో తేలిన సర్పంచ్ భవితవ్యం! (యాదాద్రి భువనగిరి) : రాజపేట మండలం, లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ ఎన్నిక ఫలితం చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొత్తం 296 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ బలపరిచిన సురేందర్ రెడ్డికి 148, బీఆర్ఎస్ మద్దతిచ్చిన ఇండ్ల రాజయ్యకు 147 ఓట్లు వచ్చాయి. అయితే, చివరి నిమిషంలో ఓ పోస్టల్ బ్యాలెట్ ఓటును లెక్కించడంతో, ఇద్దరికీ చెరో 148 ఓట్లు వచ్చి, ‘టై’ అయ్యింది. దీంతో, అధికారులు లాటరీ (డ్రా) తీయగా, అదృష్టం బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యను వరించింది.

ఓటు కోసం.. దుబాయ్ నుంచి :  ఓటు హక్కు విలువను చాటిచెబుతూ, మరికల్ పట్టణానికి చెందిన సీమ భాస్కర్, కేవలం ఓటు వేయడం కోసమే దుబాయ్ నుంచి సొంతూరికి వచ్చారు. రానుపోను విమాన ఖర్చులకు రూ.40 వేలు అయినా, తన బాధ్యతను నిర్వర్తించడం ముఖ్యమని ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

101 ఏళ్ల వృద్ధుడి ఓటు స్ఫూర్తి! (జగిత్యాల) : ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన 101 ఏళ్ల కంతి లాడే లింగన్న, కర్ర సాయంతో సొంతంగా నడుచుకుంటూ వచ్చి, పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుని, నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.

ఓటేసి.. ప్రాణం విడిచాడు! (నల్గొండ) : గట్టుప్పల మండల కేంద్రంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చెరుపల్లి బుచ్చయ్య (69), ఓటు వేసి, బ్యాలెట్ బాక్సులో వేశాడో లేదో, అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రజాస్వామ్యంపై ఆయనకున్న నిబద్ధత అందరినీ కంటతడి పెట్టించింది.

అంబులెన్స్‌లో వచ్చి.. ఆదర్శంగా నిలిచి! (నిజామాబాద్) : సాలూర మండలం, జాడిజమాల్‌పూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, పక్షవాతం, రోడ్డు ప్రమాదం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నా, ఏకంగా అంబులెన్స్‌లలో పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులే అంబులెన్స్ వద్దకు రావడం విశేషం. ఈ ఘటనలన్నీ, పల్లెల్లో ఎన్నికల పట్ల ప్రజలకు ఉన్న ఆసక్తిని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News