Telangana Panchayat election results : గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే హోరాహోరీ. ప్రతి ఓటు విలువైందే. ఒక్కోసారి ఒక్క ఓటే గెలుపోటములను తారుమారు చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఒక్కే ఒక్క ఓటు తేడాతో వార్డు సభ్యుడిగా గెలిచిన ఓ అభ్యర్థి, అనూహ్యంగా ఉపసర్పంచ్ పీఠాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఒక్క ఘటనే కాదు, తొలి విడత ఎన్నికల్లో వెలుగుచూసిన ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో!
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ముగియగా, ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి.
ఒక్క ఓటుతో.. డబుల్ ధమాకా : మెదక్ జిల్లా, టేక్మాల్ మండలం, సీతానగర్ గ్రామానికి చెందిన పత్రి సాయిలు, కాంగ్రెస్ మద్దతుతో ఆరో వార్డు నుంచి పోటీ చేశారు. మొత్తం 60 చెల్లుబాటైన ఓట్లలో, సాయిలుకు 30 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థికి 29 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది.
దీంతో, సాయిలు కేవలం ఒక్క ఓటు తేడాతో వార్డు సభ్యుడిగా గెలిచి, ఆ తర్వాత జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికలో పాల్గొని, ఆ పదవిని కూడా కైవసం చేసుకున్నారు.
మరిన్ని వింతలు, విశేషాలు : ఏకగ్రీవం నుంచి గెలుపు వరకు: టేక్మాల్ మండలంలోని చంద్రు తండాలో, 2019లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన స్రవంతి, ఈసారి ఇద్దరు ప్రత్యర్థులపై 210 ఓట్ల మెజారిటీతో గెలిచి, రెండోసారి సర్పంచ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
నాడు ఎంపీటీసీ.. నేడు సర్పంచ్: 2019లో ఎల్లంపల్లి ఎంపీటీసీగా గెలిచిన రాంబాయి, ఈసారి వెంకటాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బరిలో తోడికోడళ్లు: వెల్దుర్తి మండలం, దామరంచలో ఇద్దరు తోడికోడళ్లు, వెల్దుర్తి నాగమణి (కాంగ్రెస్ మద్దతు), వెల్దుర్తి విజయ (బీఆర్ఎస్ మద్దతు) సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుండటం స్థానికంగా ఆసక్తి రేపుతోంది.
ప్రచారంలో అస్వస్థత : చిన్నశంకరంపేట మండలం, జంగరాయిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవరెడ్డి, ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 14న ఇక్కడ రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ చిత్ర విచిత్ర ఘటనలన్నీ, గ్రామ స్థాయి రాజకీయాలు ఎంత హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా ఉంటాయో మరోసారి నిరూపిస్తున్నాయి.

