Telangana phone tapping investigation : కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. దర్యాప్తు పాశం ఇప్పుడు గత ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన వ్యక్తి మెడకు చుట్టుకుంటోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు సిట్ అధికారులు ఆయన్ను ఏం ప్రశ్నించారు? స్తబ్దుగా ఉన్న కేసు దర్యాప్తు ఒక్కసారిగా ఎందుకు వేగవంతమైంది? తెరవెనుక దొరికిన ఆ కీలక ఆధారాలేంటి?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు తిరిగి వేగవంతం చేశారు. ఇందులో భాగంగా, మాజీ సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
దర్యాప్తు మలుపు తిప్పిన కీలక పరిణామాలు
కొత్త కమిషనర్ సమీక్ష: ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ సజ్జనార్, ఈ కేసుపై ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు పురోగతి, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, ఛార్జ్‌షీట్లపై ఆరా తీసి, అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష జరిగిన కొద్ది రోజులకే ఓఎస్డీని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాధాకిషన్ రావు వాంగ్మూలమే కీలకం: ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు ముందుకు సాగుతోంది. తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో రాధాకిషన్‌రావు, తాము ‘భారత రాష్ట్రసమితి సుప్రీం’ ఆదేశాల మేరకే పనిచేశామని, పార్టీలోని కీలక నేతలతో తరచూ సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. ఈ ‘సుప్రీం’ ఎవరనే కోణంలోనే సిట్ దర్యాప్తు చేస్తోంది.
ఓఎస్డీని ఏం ప్రశ్నించారు?: రాధాకిషన్ రావు వాంగ్మూలం వెలుగులో, సిట్ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు నియామకం ఎలా జరిగింది? దానికి సంబంధించిన నోట్‌ఫైల్, జీవో జారీ ప్రక్రియలో సీఎం కార్యాలయం (సీఎంఓ) పాత్ర ఏమిటి? అసలు సీఎంఓలో నిర్ణయాల ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే కోణంలో ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్.. కానీ : గత ఏడాది శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే, ఈ అక్రమాలకు పాల్పడిన బృందం ఆధారాలను మాయం చేసేందుకు భారీ కుట్ర పన్నింది. ఎస్ఐబీ కార్యాలయంలోని విలువైన డేటాతో కూడిన 43 హార్డ్‌డిస్క్‌లను కట్టర్లతో ముక్కలు చేసి మూసీ నదిలో పడేశారు. కీలకమైన పత్రాలను కాల్చి బూడిద చేశారు. బృందంలోని ప్రతి ఒక్కరి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలోని డేటాను పూర్తిగా ఫార్మాట్ చేశారు.
విధి వక్రించి .. చిక్కిన కీలక లేఖలు!
అంతా నాశనం చేశామని భావిస్తున్న తరుణంలో, దర్యాప్తు బృందానికి ఊహించని విధంగా కొన్ని కీలక ఆధారాలు లభించాయి. ప్రభాకర్‌రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసిన ఫోన్ నంబర్ల వివరాలతో కూడిన లేఖలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీలు) అయిన జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ ఎస్ఐబీ కార్యాలయానికి పంపించాయి. అయితే, ఆ లేఖలు చేరే సమయానికి ప్రభాకర్‌రావు బృందం అక్కడ నుంచి వెళ్లిపోవడంతో, అవి వారి కంటపడలేదు. అవే ఇప్పుడు ఈ కేసులో తిరుగులేని సాక్ష్యాలుగా మారాయి. ఒకవేళ ఆ లేఖలు కూడా వారి చేతికి చిక్కి ఉంటే, వాటిని కూడా మాయం చేసేవారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఆధారాల వెలుగులోనే ఇప్పుడు దర్యాప్తు కీలక వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది.

