మరికొద్ది గంటల్లోనే 2024 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. 2025వ సంవత్సరం(New Year Resolution) గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేడుకలకు అందరూ రెడీ అయ్యారు. ఈమేరకు పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకునేందుకు యువత కూడా సై అంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) యువతకు కొన్ని సూచనలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.
‘మీ న్యూఇయర్ రిజల్యూషన్ ఏంటి?’ అని తెలంగాణ పోలీస్ విభాగం ప్రశ్నించింది. డ్రంకెన్ డ్రైవింగ్ చేయబోమంటూ నూతన సంవత్సరం తీర్మానంగా తీసుకోవాలని సూచించింది. స్నేహితులు, బంధువులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నూతన సంవత్సరంను ఆనందంగా ఆరంభించాలని ఆకాంక్షించింది.
అలాగే డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తే మీతో పాటు ఎదుటివారికీ నష్టమే అని తెలిపింది. మీరు చేసే పొరపాటు కొన్ని కుటుంబాలను చిదిమేస్తుందని గుర్తు చేసింది. డ్రంకెన్ డ్రైవింగ్ చేయనని కొత్త సంవత్సరం రిజల్యూషన్ తీసుకోండని విజ్ఞప్తి చేసింది.
ఇదే కాకుండా మీ కుటుంబానికి నూతన సంవత్సరం సందర్భంగా అద్భుతమైన కానుకలు ఇవ్వండి అని సూచించింది. మద్యం తాగి వాహనం నడపనని, డ్రగ్స్ జోలికి వెళ్లనని ప్రతిజ్ఞ చేయాలని.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని హామీ ఇవ్వాలని.. సైబర్ మోసాలపై అవగాహన కల్పించి మీ కుటుంబాన్ని సైబర్ సేఫ్‌గా ఉంచాలని కోరింది.