Police Commemoration Day: పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.ప్రతి సంవత్సరం అక్టోబరు 21న నిర్వహించే.. ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)’ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీస్ శాఖ నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అమరవీరుల సేవలు, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు, పోలీస్ శాఖ పనితీరుపై మాట్లాడారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది అమరులైనారని అన్నారు. తెలంగాణలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని తెలిపారు.
విధి నిర్వహణలో అమరులు: గ్రేహౌండ్స్ కమాండోలు టీ. సందీప్, వీ. శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్ లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారని రేవంత్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి. సైదులు, మూడు రోజుల కింద నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో అమరులయ్యారని అన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి భారీ ఎక్స్ గ్రేషియా: అమరుడైన కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ సైతం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదనంగా పోలీస్ సంక్షేమ నిధుల నుంచి ₹24 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు.
దేశంలోనే ప్రథమ స్థానం: ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది.
‘ఈగల్’ వింగ్: డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా పనిచేస్తుందని సీఎం తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని, డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు.
సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి: సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలను టెక్నాలజీతోనే ఎదుర్కొంటూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ దేశంలోనే ‘ది బెస్ట్’గా నిలిచిందని ముఖ్యమంత్రి అభినందించారు.
పోలీసు సంక్షేమం: పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే అనేక సంక్షేమ చర్యలను చేపట్టిందని ముఖ్యమంత్రి వివరించారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు ఉచిత విద్య (రెసిడెన్షియల్ స్కూల్స్‌లో), వైద్యం, మెడికల్ సీట్లలో ప్రత్యేక కోటా వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒలంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టను పెంచామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది. తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన పోలీసుల ఎక్స్ గ్రేషియాను రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు హోదాను బట్టి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. 2008లో ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్: పోలీసు సిబ్బంది పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించామని, ఇందులో 50 శాతం సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు కేటాయించామని తెలిపారు.
మహిళా ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు: తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వంటి కీలక విభాగాలకు మహిళా ఐపీఎస్ అధికారులు సారధ్యం వహించడం గర్వకారణమని అన్నారు. ఇది దేశానికే ఆదర్శమని అన్నారు.


