Honeypot network for cybercrime : అందమైన అమ్మాయిల ఫోటోలతో ఆకర్షించడం.. శృంగార సంభాషణలతో బంధించడం.. నగ్న వీడియోలతో బెదిరించి లక్షలు దోచుకోవడం! ‘హనీట్రాప్’.. అమాయకులను, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఈ వలపు వలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఓ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు, ఈ ‘హనీట్రాప్’ వేటగాళ్ల కోసం ‘హనీపాట్’ (తేనెకుండ) అనే ఉచ్చును పన్నుతున్నారు. అసలు ఏమిటీ ‘హనీపాట్’..? ఇది ఎలా పనిచేస్తుంది..?
ఏమిటీ ‘హనీట్రాప్’ : సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా నుంచి ప్రముఖులు, ధనవంతుల వివరాలు సేకరించి, అందమైన యువతుల ఫోటోలతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టిస్తారు. ఆ తర్వాత, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి, పరిచయం పెంచుకుని, నగ్న వీడియో కాల్స్ చేస్తూ, అవతలి వారిని కూడా రెచ్చగొట్టి, ఆ సంభాషణలను రహస్యంగా రికార్డు చేస్తారు. అనంతరం, ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి, లక్షలాది రూపాయలను దోచుకుంటారు.
నేరగాళ్లకు ఎర.. ‘హనీపాట్’ : ఈ హనీట్రాప్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు, తెలంగాణ పోలీసులు ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్‌తో కలిసి ఈ ‘హనీపాట్’ నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టారు. ఇది దొంగలను పట్టుకోవడానికి పోలీసులే దొంగల్లా నటించడం లాంటిదే.
నకిలీ నెట్‌వర్క్‌ల సృష్టి: ట్రిపుల్ ఐటీ పరిశోధకులు, పోలీసుల కోసం ప్రత్యేకంగా నకిలీ వెబ్‌సైట్లు, సర్వర్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లను సృష్టిస్తారు. ఇవి చూడటానికి నిజమైన వాటిలాగే ఉంటాయి.
నేరగాళ్లను ఆకర్షించడం: ఈ నకిలీ ప్రొఫైళ్ల ద్వారా, సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఆకర్షితులయ్యే విధంగా మాల్‌వేర్‌లు, ఈ-మెయిళ్లు పంపి, వారిని ఈ ఉచ్చులోకి లాగుతారు.
చిక్కాక.. చెక్: నేరగాడు ఈ ‘హనీపాట్’ వలలో చిక్కి, తన మోసపూరిత కార్యకలాపాలు ప్రారంభించగానే, సైబర్ భద్రతా బృందాలు అప్రమత్తమవుతాయి.
అష్టదిగ్బంధనం: ఆ నేరగాడి ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వంటి సాంకేతిక ఆధారాలను సేకరించి, వారిని అష్టదిగ్బంధనం చేస్తారు. అనంతరం, పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు.
ఇప్పటికే ఇతర నగరాల్లో : ఈ ‘హనీపాట్’ విధానాన్ని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు పోలీసులు ఇప్పటికే విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి, అనేక మంది సైబర్ నేరగాళ్లను, నైజీరియన్లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ సాంకేతిక సహకారంతో తెలంగాణ పోలీసులు ఈ విధానాన్ని మరింత పటిష్ఠంగా, ప్రభావవంతంగా అమలు చేయనున్నారు. ఇందుకోసం ట్రిపుల్ ఐటీలో ప్రత్యేకంగా ‘సైబర్ హబ్’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కొత్త అస్త్రంతో, వలపు వల వేస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పట్టడం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


