Telangana Police citizen-friendly technology : ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలి.. ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం రోజుల తరబడి తిరగాలి.. ఈ పాతకాలపు పోలీసింగ్ పద్ధతులకు తెలంగాణ పోలీసులు స్వస్తి పలుకుతున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా చేసుకుని, ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అండగా నిలుస్తున్నారు. మీ చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండానే, మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అసలు ఈ కొత్త సేవలేంటి..? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి..?
స్మార్ట్‌ఫోనే.. మీ పోలీస్ స్టేషన్ : ప్రజాహిత పోలీసింగ్‌లో భాగంగా, పౌరులకు సేవలను సులభతరం చేసేందుకు తెలంగాణ పోలీసులు అనేక సాంకేతిక సాధనాలను అందుబాటులోకి తెచ్చారు.
ఎలాగైనా ఫిర్యాదు చేయొచ్చు: సమస్య ఏదైనా, కళ్ల ముందు దారుణం జరుగుతున్నా, ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. SMS, వాట్సాప్, డయల్ 100/112, ఈ-మెయిల్.. ఇలా ఏ రూపంలోనైనా మీరు ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదు తీవ్రతను బట్టి, పోలీసులే మిమ్మల్ని సంప్రదిస్తారు.
మహిళలకు అండగా ‘టీ-సేఫ్’ (T-Safe) యాప్: ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం, 2024 మార్చిలో ఈ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు.
ఎలా పనిచేస్తుంది : యాప్‌లో మీ పేరు, ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని, మీరు ప్రయాణించే వాహనం నంబర్, గమ్యస్థానం వివరాలు నమోదు చేయాలి.
రియల్ టైమ్ పర్యవేక్షణ: మీరు ‘స్టార్ట్’ బటన్ నొక్కగానే, పోలీసులు మీ లొకేషన్‌ను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు.
తక్షణ స్పందన: మీరు వెళ్లే దారి మారినా, హెచ్చరిక సందేశాలకు స్పందించకపోయినా, యాప్ ఆటోమేటిక్‌గా డయల్ 100కు సమాచారం పంపి, సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తుంది.
పోలీసుల పనితీరుపై మీ ‘ఫీడ్‌బ్యాక్’: పోలీసుల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ‘సిటిజన్ ఫీడ్‌బ్యాక్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ ఫోన్‌లో ఓపెన్ అయ్యే వెబ్ పేజీలో, పోలీసుల పనితీరుపై (ఫిర్యాదు స్వీకరణ, ఎఫ్‌ఐఆర్, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్) మీ అభిప్రాయాన్ని తెలుగు లేదా ఇంగ్లీషులో నమోదు చేయవచ్చు.
అన్నింటికీ ‘హాక్-ఐ’ (Hawk Eye) యాప్: ఈ ఒక్క యాప్‌తో అనేక సేవలు పొందవచ్చు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోలీసుల దుష్ప్రవర్తన, నేరస్థుల సమాచారం వంటివి రిపోర్ట్ చేయవచ్చు. ‘టీ-సేఫ్’ తరహాలోనే, ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమ వివరాలు నమోదు చేసుకుంటే, పోలీసులు పర్యవేక్షిస్తారు.
ఎఫ్ఐఆర్, దర్యాప్తు వివరాలు.. ఇకపై మీ ఫోన్‌కే : ఎఫ్ఐఆర్ నమోదు కాగానే, ఆ కాపీతో కూడిన వెబ్ లింకును ఫిర్యాదుదారుడి ఫోన్‌కు SMS రూపంలో పంపిస్తున్నారు. కేసు దర్యాప్తు పురోగతి, ఛార్జిషీట్ వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సాంకేతిక సంస్కరణలతో, తెలంగాణ పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, స్నేహహస్తం అందిస్తున్నారు.


