Private Colleges Strike: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు మరోమారు మూతపడనున్నాయా.. అంటే అవుననే అంటున్నారు ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రేవంత్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల నిర్వహణ సంఘం డిమాండ్ చేసింది. లేకుంటే అక్టోబర్ 13 నుంచి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేయనున్నట్లు తెలిపింది. గత నెలలో రూ.900 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. అక్టోబర్ 1 వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి. సత్యనారాయణ రెడ్డి అన్నారు. దసరాకు ముందు మరో రూ.600 కోట్లు అలాగే దీపావళికి ముందు అదనంగా రూ.600 కోట్లు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ బకాయిలు చెల్లించలేదని బి. సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
రూ.10 వేల కోట్లు పెండింగ్!: మిగిలిన బకాయిలను అక్టోబర్ 12 నాటికి విడుదల చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి. సత్యనారాయణ రెడ్డి అన్నారు. లేదంటే అక్టోబర్ 13 నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సంఘానికి మద్దతు తెలుపుతూ దసరాకు ముందు రూ.1,200 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యాయని బి. సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు.
Also read:https://teluguprabha.net/andhra-pradesh-news/sebi-expert-challa-deviprasad-participated-in-gitam-school-of-business-program/
మౌలిక సదుపాయాలు అందించలేకపోతున్నాం: ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు అధికారులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించినా ఫలితం లేదని ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల బోధనా రుసుములను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. అధ్యాపకులకు జీతాలు కూడా చెల్లించలేక పోతున్నామని పేర్కొంది. కాలేజీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చలేకపోతున్నామని వారు తెలిపారు.
నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి: ప్రైవేట్ కాలేజీలు ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై సమ్మెకు దిగుతామని బెదిరించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అసోసియేషన్‌తో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఈ వారం కళాశాల యాజమాన్యాలతో మరోమారు సమావేశమయ్యే అవకాశం ఉంది.


