Private Colleges Strike: ప్రైవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. నిన్న అర్ధరాత్రి వరకు ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాల మధ్య చర్చలు జరిగినా.. ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు నిర్ణయం వెల్లడిస్తామని చెప్పడంతో అందరి దృష్టి ఇప్పుడు ప్రభుత్వంపైనే ఉంది. దీంతో కళాశాలలు ఈరోజు మూసివేయబడతాయా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. భేటీకి ముందు యాజమాన్యాలు అన్ని కాలేజీలను మూసివేస్తామని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
చర్చల వివరాలు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్యా సంస్థలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిగాయి. ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావులతో కూడిన ప్రభుత్వ బృందం, సమాఖ్య ప్రతినిధులతో సమావేశమైంది. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు అర్ధరాత్రి 12.30 గంటల వరకు కొనసాగాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/heavy-rainfall-in-hyderabad-man-killed-in-wall-collapse/
ప్రభుత్వ వైఖరి: ఈ చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అప్పటివరకు సమ్మెను విరమించాలని ఆయన కళాశాలల యాజమాన్యాలను కోరారు.
కళాశాలల డిమాండ్లు: నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సమ్మె చేపట్టినట్లు సమాఖ్య ఛైర్మన్ ఎన్. రమేష్, ప్రధాన కార్యదర్శి కె.ఎస్. రవికుమార్ స్పష్టం చేశారు. రూ. 1200 కోట్ల పెండింగ్ బిల్లులను దసరాలోపు చెల్లించాలని కోరారు. నాలుగేళ్ల బకాయిలను డిసెంబర్ 31లోపు విడుదల చేయాలని అన్నారు. బోధనా రుసుములను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటుపై నివేదికను అక్టోబరు 31లోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీఓ, ఫీజు రీయింబర్స్‌మెంట్ డిసెంబర్ 31లోపు విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్లను నెరవేర్చేవరకు ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ కళాశాలలు బంద్‌ను పాటిస్తాయని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
సెలవులు ప్రకటించిన కాలేజీలు: ఈ సమ్మె నేపథ్యంలో పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పటికే విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ మెసేజ్‌లు పంపాయి. కొన్ని కాలేజీలు ఈ నెల 17 వరకు.. మరికొన్ని వారం రోజుల పాటు తరగతులు ఉండవని తెలిపాయి. కొన్ని కళాశాలలు మాత్రం ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని పేర్కొనాయి. ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


