Railway track flooding issues : చినుకు పడితే చాలు.. రైలు చక్రాలకు బ్రేకులు పడుతున్నాయి. పట్టాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ‘మొంథా’ తుపానుకు కురిసిన వర్షానికి డోర్నకల్ జంక్షన్, వరంగల్ స్టేషన్లలో రైల్వే ట్రాకులు నీట మునగడం, సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇది తొలిసారి కాదు, ఏటా ఇదే కథ పునరావృతమవుతోంది. కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపడుతున్న రైల్వే శాఖ, చిన్నపాటి వానకే ఎందుకు చేతులెత్తేస్తోంది? ట్రాకులు ఎందుకు పదేపదే మునుగుతున్నాయి? ఈ సమస్యకు మూల కారణాలేంటి?
డోర్నకల్‌లో ఏం జరిగింది : అక్టోబరు 29న కురిసిన కేవలం 12.65 సెంటీమీటర్ల వర్షానికే డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని రెండు కిలోమీటర్ల పొడవైన ట్రాక్ పూర్తిగా నీట మునిగింది. ఇది వాగును తలపించింది. ఫలితంగా గోల్కొండ, కోణార్క్, కృష్ణా, ఇంటర్‌సిటీ వంటి కీలక రైళ్లు మార్గమధ్యంలోనే గంటల తరబడి నిలిచిపోయాయి. ట్రాక్‌పైకి చేరిన నీటిని బయటకు పంపడానికి రైల్వే సిబ్బందికి ఏకంగా 8 గంటల సమయం పట్టింది. ఈ ఒక్క సంఘటన చాలు, రైల్వే శాఖ డొల్లతనాన్ని బయటపెట్టడానికి.
గుణపాఠం నేర్వని రైల్వే శాఖ : ఇలా ట్రాకులు నీట మునగడం ఇదే మొదటిసారి కాదు.
గత ఆగస్టులో: ఇదే డోర్నకల్ యార్డులోకి భారీగా వరద నీరు చేరింది. అప్పుడు హెచ్చరికలు వచ్చినా, అధికారులు శాశ్వత చర్యలు చేపట్టలేదు.
గతేడాది: మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య ట్రాక్ మునిగి 24 రైళ్లు రద్దయ్యాయి.
నాలుగేళ్ల క్రితం: గార్ల మండలం మద్దివంచ వద్ద ఊర చెరువుకు గండి పడి, ట్రాక్‌పై అడుగున్నర ఎత్తులో నీరు ప్రవహించింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, రైల్వే శాఖ “నిమ్మకు నీరెత్తినట్లు” వ్యవహరిస్తోందని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యకు అసలు కారణాలివే..
అధ్వానపు డ్రైనేజీ వ్యవస్థ: స్టేషన్లలోని డ్రైనేజీల్లో మట్టి, చెత్త పేరుకుపోయి, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోతోంది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.
అశాస్త్రీయ నిర్మాణాలు: రైల్వే స్టేషన్ల నుంచి వరద నీరు సమీపంలోని చెరువులు, కుంటల్లోకి వెళ్లేందుకు సరైన కాలువలు లేవు. ముంబయి వంటి నగరాల్లో కాంక్రీట్ గోడలు, పటిష్ఠమైన డ్రైన్ల ద్వారా వరదను నియంత్రిస్తున్నా, ఇక్కడ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు.
పర్యవేక్షణ లోపం: రైల్వే ట్రాక్‌ల పక్కన ఉన్న చెరువులు, కుంటల కట్టల పటిష్ఠతను పర్యవేక్షించడంలో రైల్వే, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం కొరవడింది.
భవిష్యత్తు మాటేమిటి : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే నెక్కొండ-వరంగల్ మధ్య మూడో లైను వచ్చింది, త్వరలో నాలుగో లైను కూడా రానుంది. రైళ్ల సంఖ్య, ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో, చిన్న వానకే వ్యవస్థ కుప్పకూలుతుంటే, భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా రైల్వే శాఖ మేల్కొని, తాత్కాలిక మరమ్మతులు కాకుండా, పకడ్బందీ ప్రణాళికతో శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని అందరూ కోరుతున్నారు.


