Rains : తెలంగాణలో వర్షాలు ఆగడం లేదు. ఉత్తర తెలంగాణలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కొనసాగుతున్నాయి.
ALSO READ: NEET : NEET విద్యార్థులకు శుభవార్త: MBBS సీట్ల పెంపు, కొత్త కాలేజీలపై నిషేధం లేదు!
వర్షాల కారణంగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో 50.1 మి.మీ. వర్షపాతం నమోదైంది, దీంతో పంటలు నీటమునిగాయి. ఆదిలాబాద్‌లో 173 మి.మీ. వర్షం కురవడంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రైతులు పంట నష్టంతో కన్నీరు పెట్టుకుంటున్నారు.
మంజీరా నది ఉధృతితో ఏడుపాయల ఆలయం జలమయమైంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులో 19.078 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌లో వంతెనలు మునిగిపోవడంతో మహారాష్ట్రతో రాకపోకలు నిలిచాయి. రైతులకు పంట నష్టం భర్తీ చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు.


