Today Rains: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నేడు ముసురు తో కూడిన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో వచ్చే 2 గంటలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న రోజంతా ఉన్నట్లే నేడు కూడా మిగతా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ, మధ్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి తేలికపాటి వర్షాలు కురిసాయని తెలిపింది.
రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా పెరిగి, వర్షాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జూలై మొదటి వారం నుండి రుతుపవనాలు మరింత చురుకుగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో:
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసాయి. ఊహించినట్లుగానే తెలంగాణలో రుతుపవనాలు జోరుగా విస్తరిస్తున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేటలో అద్భుతమైన వర్షాలు కురిశాయి. అలాగే మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భోనగిరి, జనగామ లో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసాయి. హైదరాబాద్ లో మాత్రం చిరు జల్లులతో సరిపెట్టుకుంది.
రుతుపవనాల ప్రభావం:
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూలై మొదటి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉందంటున్నారు. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు కీలకమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.