తెలంగాణ రాజ్‌భవన్‌లో(Raj Bhavan) హార్డ్ డిస్క్‌లు చోరీకి గురి కావడం సంచలనంగా మారింది. ఈ చోరీపై రాజ్‌భవన్ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు.. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. ఈనెల 14వ తేదీన రాజ్ భవన్‌లోకి మాజీ ఉద్యోగి శ్రీనివాస్ హెల్మెట్ ధరించి వచ్చి నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు.
గతంలోనూ శ్రీనివాస్ జైలుకు వెళ్లి వచ్చాడు. రాజ్ భవన్ లో పనిచేసే తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఆ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మార్ఫింగ్ ఫొటోలను శ్రీనివాసే పంపించాడని గుర్తించారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఇటీవల ఈ కేసు నుంచి బెయిల్‌పై విడులైన శ్రీనివాస్.. రాజ్ భవన్ లోపలికి వెళ్లి తన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌లను చోరీ చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి శ్రీనివాస్ చోరీ చేసినట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు ఉండటంతో వాటిని డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడినట్లు తేల్చారు.