Telangana ration eKYC update : ప్రతి నెలా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి! మీ రేషన్ కార్డుకు ‘ఈకేవైసీ’ ప్రక్రియ పూర్తి చేశారా? ఒకవేళ చేయకపోతే, త్వరలోనే మీ ఇంటికి వచ్చే రేషన్ బియ్యం ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ తుది హెచ్చరిక పేదల గుండెల్లో గుబులు రేపుతోంది. అసలు ఎందుకీ ఈకేవైసీ తప్పనిసరి చేశారు? గడువులోగా పూర్తి చేయకపోతే ఎదురయ్యే పరిణామాలేంటి? ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి?
ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా సబ్సిడీపై బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అయితే, ఈ పథకంలో అనర్హులను ఏరివేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఈకేవైసీ’ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ అనేక జిల్లాల్లో సుమారు 30 శాతం మంది లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎందుకీ తప్పనిసరి నిబంధన? : రేషన్ పథకంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన లొసుగులను సరిదిద్దడానికే ప్రభుత్వం ఈకేవైసీ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
బోగస్ కార్డుల ఏరివేత: చాలా కుటుంబాల్లో సభ్యులు మరణించినా, ఆడపిల్లలకు పెళ్లిళ్లయి అత్తవారింటికి వెళ్లినా వారి పేర్లను కార్డుల నుంచి తొలగించడం లేదు. వారి కోటాను కూడా కుటుంబసభ్యులు తీసుకోవడంతో ప్రభుత్వానికి ప్రతి నెలా వందల క్వింటాళ్ల భారం పడుతోంది. ఈకేవైసీ ద్వారా వేలిముద్రలు సరిపోలితేనే బియ్యం ఇస్తారు కాబట్టి, మరణించిన వారి పేర్లు వాటంతట అవే తొలగిపోతాయి.
నిరుపయోగ కార్డుల గుర్తింపు: వరుసగా ఆరు నెలల పాటు రేషన్ తీసుకోని కార్డులను గుర్తించి, వారి కోటాను నిలిపివేయడానికి లేదా కార్డును రద్దు చేయడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
చేయకుంటే ఏమవుతుంది? అధికారుల మాటల్లోనే…
“రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందే. పలుమార్లు గడువు పొడిగించినా ఇంకా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయరో, ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యాన్ని తగ్గించి సరఫరా చేస్తాం. ఆ తర్వాత కూడా స్పందించకపోతే కార్డు నుంచి వారి పేరును తొలగించే అవకాశముంది” అని పౌరసరఫరాల శాఖాధికారి ప్రేమ్‌కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు కూడా తక్షణమే ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన సూచించారు.
ప్రక్రియలో ఇబ్బందులు… ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు : ఈ కేవైసీ ప్రక్రియలో లబ్ధిదారులకు కొన్ని సాంకేతిక సమస్యలు గుదిబండగా మారాయి. చాలామందికి, ముఖ్యంగా వృద్ధులకు రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు సరిపోలడం లేదు. దీనికి ప్రధాన కారణం, వారి ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ సమాచారం పదేళ్ల క్రితం నమోదు చేసి ఉండటమే. ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోకపోవడంతో ఈ-కేవైసీ పూర్తి కావడం లేదు. దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పరిమిత సంఖ్యలో ఉన్న ఆధార్ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు.
అధికారుల తుది హెచ్చరిక : ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించింది. ఇంకా ఎవరైనా ఈకేవైసీ పూర్తి చేయకుండా తాత్సారం చేస్తే, వారి రేషన్ కోల్పోవడం తథ్యం. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ హక్కును కోల్పోకుండా, వెంటనే సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఒకవేళ వేలిముద్రలు పడకపోతే, వెంటనే ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసుకోవడం ఒక్కటే మార్గం.


