Eco-friendly bags in Telangana ration shops : రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి పాత సంచులు, ప్లాస్టిక్ కవర్లు పట్టుకెళ్లే రోజులకు కాలం చెల్లింది. తెలంగాణ ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై రేషన్ దుకాణాల్లోనే బియ్యంతో పాటు బ్యాగులు కూడా అందనున్నాయి. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..? ఈ బ్యాగుల ప్రత్యేకత ఏమిటి..? వీటి పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది..?
సెప్టెంబర్ నుంచి కొత్త విధానం: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే సెప్టెంబర్ నెల నుంచి పంపిణీ చేసే సన్న బియ్యంతో పాటు, పర్యావరణ హితమైన (Eco-Friendly) బ్యాగులను కూడా ఉచితంగా అందజేయనుంది. ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల స్థాయి గోదాములకు (MLS పాయింట్లు) ఈ బ్యాగులు చేరుకున్నాయి. అక్కడి నుంచి రేషన్ డీలర్లకు కార్డుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేయనున్నారు.
బ్యాగులపై ప్రభుత్వ పథకాల ప్రచారం: ఈ బ్యాగులను కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, ప్రభుత్వ పథకాల ప్రచారానికి కూడా వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రస్తావిస్తూ, “అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం” అనే నినాదాన్ని ఈ బ్యాగులపై స్పష్టంగా ముద్రించారు. లబ్ధిదారులు ప్రతి నెలా బియ్యం కోసం ఇదే బ్యాగును తీసుకురావడం ద్వారా ప్లాస్టిక్‌కు దూరంగా ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అధికారికంగా ఏర్పాట్లు పూర్తి: ఈ కార్యక్రమంపై నారాయణపేట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ సైదులు మాట్లాడుతూ, “బ్యాగులు ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు, సెప్టెంబర్ కోటా బియ్యంతో పాటే వీటిని లబ్ధిదారులకు అందజేస్తాం. ప్లాస్టిక్‌ను నిర్మూలించాలన్నదే మా ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఒక్క నారాయణపేట జిల్లాలోనే 1,61,719 రేషన్ కార్డులకు సరిపడా బ్యాగులను సిద్ధం చేసినట్లు తెలిపారు.
పెరుగుతున్న లబ్ధిదారులు: ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలు దాటింది. కొత్త కార్డుల జారీ, ఉన్న కార్డులలో సభ్యుల పేర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్ ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి నెలకు 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను (18 కిలోలు) ఒకేసారి జూన్‌లోనే పంపిణీ చేసిన విషయం తెలిసిందే. బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, ఉప్పు, నూనె వంటి నిత్యావసరాలను కూడా రేషన్ ద్వారా అందించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


