Telangana Rising Global Summit Investments: ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిరథమహారథులు తెలంగాణపై ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో దూసుకుపోతోందని కొనియాడారు.
ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిందని ఈ సందర్భంగా తెలిపారు. అన్ని విభాగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని.. మౌలిక వసతుల కల్పనలో తామే ముందున్నామని వ్యాఖ్యానించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-speech-in-telangana-rising-global-summit/
ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరం ఆలోచన అభినందనీయమని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా విజనరీ, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందన్నారు.
తెలంగాణ విజన్‌ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమ్ అదానీ కుమారుడు, APSEZ ఎండీ కరణ్ అదానీ కొనియాడారు. తెలంగాణలో అదానీ గ్రూప్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టిందని.. దేశంలోనే తొలిసారిగా యూఏవీ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. వీటిని సైన్యానికి అందిస్తామని.. ఈ యూఏవీలను ప్రపంచ మార్కెట్‌లోనూ విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 25 వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కరణ్ అదానీ వివరించారు.
ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శోభన కామినేని పాల్గొని ప్రసంగించారు. వ్యాపార అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు మంచి అవకాశాలు కల్పిస్తోందని శోభన హర్షం వ్యక్తం చేశారు. 38 ఏళ్లుగా రాష్ట్రంలో తమ పెట్టుబడులు కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్‌గా ఉందని కొనియాడారు.
అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీపడుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని.. తర్వాత తరానికి ఏం కావాలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచించిందన్నారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ గొప్ప వాటా కలిగి ఉందని కొనియాడారు. తెలంగాణతో పాటు దక్షిణ భారత అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని పేర్కొన్నారు.
గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ హబ్‌గా భారత్ మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సెల్‌ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని.. దశాబ్ద కాలంగా భారత్‌కు విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని తెలిపారు. కేంద్రం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారీతనం వల్లే పెట్టుబడులు పెరిగాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

