RTA inspections on private travel buses: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద సంఘటనతో రాష్ట్ర రవాణా శాఖ అప్రమత్తమైంది. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై తెలంగాణ ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
నిబంధనలు పాటించని బస్సులపై కేసు నమోదు: నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల మేరకు వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎల్బీ నగర్‌లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో 4 బస్సులపై సైతం కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
కీలక వివరాలు వెల్లడించిన ఫోరెన్సిక్ నిపుణులు!: కర్నూలు బస్సు ప్రమాదానికి గల కారణాలను ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్‌లో.. వందల మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ బృందాలు తెలిపాయి. ఆ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. తొలుత బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైందని అన్నారు. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో.. దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టుగా తెలిపారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ నిప్పురవ్వలకు పెట్రోల్ తోడవడంతో మంటలు వ్యాపించాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్‌కు అంటుకోవడంతో.. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయని.. దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. మొబైల్ ఫోన్లు ఉన్న లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో ఉన్న వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారు తప్పించుకునే సమయం లేకుండా పోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.


