MLA disqualification proceedings : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. బీఆర్ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ఆరోపణలతో అనర్హత వేటును ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తున్న తరుణంలో, న్యాయనిపుణులతో సుదీర్ఘ మంతనాల అనంతరం వారికి నోటీసులు జారీ చేయాలని నిశ్చయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ స్పీకర్ నిర్ణయం వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలేమిటి..? ఆ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమేనా..?
సుప్రీం ఆదేశాలతో కదలిక : తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, గత నెల 31న కీలక తీర్పు వెలువరించింది. పిటిషన్లపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, అంతకుమించి సమయం తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అడ్వొకేట్ జనరల్ మరియు పలువురు సీనియర్ న్యాయవాదులతో సమగ్ర చర్చలు జరిపారు. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ, తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వారి నుంచి వివరణ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
నోటీసులు అందుకునేది వీరే : బీఆర్ఎస్ పిటిషన్ మేరకు స్పీకర్ నుంచి నోటీసులు అందుకోనున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, యం.సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలందరూ తమ వివరణను స్పీకర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే, వీరిలో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరలేదని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
న్యాయ నిపుణులతో చర్చించే ముందుకెళ్తా: సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. తీర్పు కాపీ అందిన వెంటనే న్యాయ నిపుణులతో కూలంకషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాం.ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా, వివరణ ఇచ్చేందుకు వారు కొంత సమయం కోరారు,” అని ఆయన తెలిపారు. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే రాజ్యాంగబద్ధంగా తన నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


