MLAs disqualification petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేడు, రేపు విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్‌లు చేయనున్నట్టుగా స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఇటీవలే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ ఈసారి జరిగే విచారణలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, శేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నట్టుగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు.
రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్: బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై.. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉండనుందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లాం వెంకట్రావు, అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై ఈనెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపట్టనున్నట్టుగా స్పీకర్ కార్యాలయం వెళ్లడించింది. మొదట పిటిషనర్లు.. ఆ తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందని పేర్కొంది.
నేడు భద్రాచలం, జగిత్యాల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ: ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వర్సెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఉదయం 12 గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి వర్సెస్ సంజయ్ న్యాయవాదుల మధ్య వాదనలు, క్రాస్ఎగ్జామినేషన్ జరుగనున్నది. అదేవిధంగా ఈనెల 7న ఉదయం 11గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఉదయం. 12గం.లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ న్యాయవాదుల మద్య వాదనలు, క్రాస్ఎగ్జామినేషన్ను చేయనున్నట్టుగా స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఈనెల 12న కేపీ వివేకానంద వర్సెస్ తెల్లం వెంకట్రావు, జగదీష్‌రెడ్డి వర్సెస్ సంజయ్, ఈనెల 13న జగదీష్‌రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరికపూడి గాంధీ న్యాయవాదుల మద్య వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగునున్నది. దీంతో ఎనిమిది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కానుంది. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలు ఆంక్షలు విధించారు. మీడియా, సందర్శకులు, రాజకీయ నేతలు, విచారణకు హాజరయ్యే వారిపై సైతం ఆంక్షలు అమలవుతాయని అన్నారు. విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


