Telangana weather updates: రాష్ట్రాన్ని ఇప్పటికే గజగజలాడిస్తున్న చలి తీవ్రత.. సోమ, మంగళ, బుధవారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటం వంటి కారణాలతో చలి తీవ్రత పెరిగినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు: గత మూడు రోజులుగా రాష్ట్రంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ నమోదవుతూ వస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. పటాన్‌చెరులో 16.8 డిగ్రీల సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకావాల్సి ఉండగా 3.6 డిగ్రీలు తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌లో 1.5 డిగ్రీలు తగ్గి 14.2, మెదక్‌లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1, హనుమకొండలో 4.2 డిగ్రీలు తగ్గి 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లుగా తెలిపారు. ఇక హైదరాబాద్‌లో సైతం చలి విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌లో 1.6 డిగ్రీలు తగ్గి 16.9 డిగ్రీల సెల్సియస్ రికార్డయ్యింది. హయత్‌నగర్‌లో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత కంటే 1.2 డిగ్రీలు తగ్గి 15.6డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
పగటిపూట ఉష్ణోగ్రతలలో సైతం మార్పు: రాత్రి పూట నమోదైయ్యే కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం తగ్గాయి. ఆదివారం రామగుండంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు తగ్గి 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే నిజామాబాద్‌లో 1.7 డిగ్రీలు తగ్గి 30.2 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు తగ్గి 29.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


