Telangana weather updates: రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాకాలం ముగిసిన వెంటనే చలిగాలులు గజగజ వణికిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలుల ప్రభావం మొదలై.. మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతున్నది. రాష్ట్రంలోని ప్రజలు తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల మధ్య వరకు ఉండాల్సిన ఈశాన్య రుతుపవనాలు అనేవి ‘మొంథా’ తుపాను ప్రభావంతో త్వరగానే నిష్క్రమించడంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పొడి వాతావరణ పరిస్థితి: నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 14న తిరోగమనం మొదలవగా.. అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమించాయి. అయితే ఈశాన్య రుతుపవనాల కాలం మొదలైనప్పటికీ.. ఈ నెల మొదటి వారంలోనే నిష్క్రమించాయి. అక్టోబర్ 27 నుంచి మూడు రోజుల పాటు ప్రభావం చూపిన ‘మొంథా’ తుపాను అక్టోబర్ 30 నాటికి బలహీనపడింది. ఈ తుపాన్‌తో పాటు తేమ అంతా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు: రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న ఆదిలాబాద్ నుంచి దక్షిణాన ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా వరకు చలి సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నది. అయితే మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వాతావరణ నిపుణులు ఈ ఏడాదిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు: నవంబర్ 8 న హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పటాన్ చెరు ఇక్రిశాట్ ప్రాంతంలో శనివారం 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక బేగంపేటలో 16.9, హయత్‌నగర్ 17, హకీంపేట 17.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ 14.2, మెదక్ 15, నిజామాబాద్ 16.8, మహబూబ్ నగర్ 18.5, రామగుండం 19.6, ఖమ్మం జిల్లాలో 19.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.


