Sunday, January 18, 2026
HomeతెలంగాణTRAGEDY IN USA: అమెరికాలో అగ్నికీలలు.. తెలంగాణ విద్యార్థిని మృతి

TRAGEDY IN USA: అమెరికాలో అగ్నికీలలు.. తెలంగాణ విద్యార్థిని మృతి

Telangana student dies in US fire : ఉన్నత చదువుల కోసం ఎన్నో కలలతో ఏడు సముద్రాలు దాటింది. ఉన్నత శిఖరాలను అధిరోహించి, కన్నవారి కళ్లలో ఆనందం చూడాలనుకుంది. కానీ, విధి వెక్కిరించింది. అమెరికాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, ఆ తెలంగాణ తేజాన్ని బలితీసుకుంది. చదువు పూర్తి చేసుకుని, ఈ ఏడాదే సొంత గడ్డపై అడుగుపెట్టాల్సిన ఆ యువతి, ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అసలు ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? ఆ ఆశల సౌధం ఎలా కుప్పకూలింది?

- Advertisement -

అమెరికాలోని అలబామా రాష్ట్రం, బర్మింగ్‌హామ్‌లో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఉడుముల సహజారెడ్డి (24) నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న మరో భవనంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. అర్ధరాత్రి కావడంతో, గాఢ నిద్రలో ఉన్న ఆమె, అగ్నికీలల్లో చిక్కుకుని, అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో, అపార్ట్‌మెంట్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన మరో 10 మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఎవరీ సహజారెడ్డి : సహజారెడ్డి స్వస్థలం మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, వెంకటాపూర్ గ్రామం. తండ్రి ఉడుముల జయాకర్ రెడ్డి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తల్లి శైలజ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఉన్నత విద్య కోసం, 2021లో ఎంఎస్ చదివేందుకు సహజారెడ్డి అమెరికాలోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లారు.

కన్నీటి సంద్రంలో కుటుంబం : చదువు పూర్తి కావొస్తున్న తరుణంలో, ఈ ఏడాదే కుమార్తె తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు, ఆమె మరణవార్త పిడుగుపాటులా తగిలింది. ప్రతిరోజూ వీడియో కాల్‌లో తమ కుమార్తెతో మురిసిపోయే ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సహజారెడ్డి మృతి వార్త తెలియగానే, వారు నివసిస్తున్న శ్రీనివాస కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు వారి ఇంటికి చేరుకుని, ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. అమెరికాలోని అధికారులు, సహజారెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News