Telangana Tet Notification Is Likely To Be Released Next Week: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను అధికారులు సీఎం ఆమోదం కోసం పంపారు. ప్రతి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే, మరో వారంలో నోటిఫికేషన్ విడుదలకానుంది. కాగా, టెట్‌కు సంబంధించిన పాత జీవోను సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది జూన్‌లో తొలి విడత పరీక్షలు నిర్వహించి.. జులై 22న ఫలితాలు వెల్లడించింది. మళ్లీ ఈ నెలలోనే రెండో విడత టెట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపథ్యంలో టెట్ జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, సుప్రీం కోర్టు నిబంధనలపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఎటువంటి నిర్ణయం వస్తుందోనని ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో టెట్ పాస్ కాని ఉపాధ్యాయులు సుమారు 45 వేల మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిసెంబరు 12 వరకు సెలవులో ఉన్నారు. ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఉన్న శ్రీదేవసేన ఆలోపు నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఏటా రెండు సార్లు టెట్..
గతంలో 2011 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరే వారికి మాత్రమే టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో ఈ నియమం మారింది. సుప్రీం తీర్పు ప్రకారం ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు (ఇన్-సర్వీస్ టీచర్స్) కూడా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరిగా మారింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు, ప్రస్తుతం ఉన్న టెట్ జీవోలో సవరణలు చేయాల్సి ఉంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందాలన్నా కూడా టెట్ అర్హత విధిగా ఉండాలనే అంశాలను కొత్త జీవోలో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈ కీలక మార్పుల కారణంగా, ప్రమోషన్ల కోసం పోటీ పడే ఉపాధ్యాయులు సహా సుమారు 45 వేల మందికి పైగా ఇన్-సర్వీస్ టీచర్లు రాబోయే రెండేళ్లలో టెట్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ప్రమోషన్లకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులతో కలిపితే ఈ సంఖ్య 60 వేల వరకు చేరే అవకాశం ఉంది. వీరంతా రాబోయే పరీక్షకు సమాయత్తం అవుతున్నారు.


