Telangana Teacher Eligibility Test : ఆరు నెలలకోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీతో లక్షలాది మంది అభ్యర్థులు నవంబర్ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఓ కీలక తీర్పు ఇప్పుడు ఆ నిరీక్షణపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయుల భవితవ్యాన్ని ప్రభావితం చేయగల ఆ తీర్పు ఏంటి…? దానివల్ల నవంబర్ నోటిఫికేషన్‌కు ఎదురైన ఆటంకం ఏమిటి..? ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి..?
రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల ఆశావహుల్లో నవంబర్ టెట్ నోటిఫికేషన్‌పై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తున్నప్పటికీ, సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ప్రక్రియకు అడ్డంకిగా మారింది. ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ టెట్ జీఓలో కీలక సవరణలు చేయాల్సి ఉండటంతో, ఆ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తుండటంతో, సర్కారు ఇరకాటంలో పడింది.
సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఇదే: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న చారిత్రక తీర్పును వెలువరించింది.
టెట్ తప్పనిసరి: ప్రస్తుతం సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగంలో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులవ్వాలి. ఇందుకు తీర్పు వెలువడిన నాటి నుంచి రెండేళ్ల గడువు (2027 నాటికి) విధించింది. గడువులోగా టెట్ పాస్ కాని పక్షంలో వారు ఉద్యోగం వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
వీరికి మినహాయింపు: అయితే, ఐదేళ్లలోపు పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఉపాధ్యాయులకు మాత్రం టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ, వారు పదోన్నతులు పొందాలంటే మాత్రం కచ్చితంగా టెట్ అర్హత సాధించాలని షరతు విధించింది.
ప్రభుత్వం ముందున్న చిక్కుముడి: సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం 2015 డిసెంబర్ 23న జారీ చేసిన జీఓ 36లో మార్పులు చేయాలి. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, దానిపై రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చాప రవి ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, మరికొన్ని సంఘాలు అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఒకవేళ ప్రభుత్వం జీఓను సవరించి నోటిఫికేషన్ ఇస్తే ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సవరణలు చేయకపోతే నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి.
30 వేల మందిపై ప్రభావం: సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా అమలైతే రాష్ట్రంలో సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ఉపాధ్యాయుల సర్వీసుపై ప్రత్యక్ష ప్రభావం పడనుందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏప్రిల్/మే నెలలో జరిగిన టెట్‌కు 1,37,429 మంది హాజరుకాగా, 59,692 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి నవంబర్ నోటిఫికేషన్ విడుదలైతే కనీసం లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


