Sunday, November 16, 2025
HomeతెలంగాణUttam Kumar Reddy: సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటుకు కసరత్తు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy: సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటుకు కసరత్తు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Uttam on KTR : రాష్ట్రంలో సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంఘాల ద్వారా చెరువులు, కాలువల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రారంభంలో చెరువుల స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేసి, ఆ తర్వాత పెద్ద ప్రాజెక్టుల వరకు విస్తరించనున్నట్లు వివరించారు. ప్రతి సాగునీటి సంఘానికి జలవనరుల శాఖ నుంచి ఒక అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులతో చర్చించిన అనంతరం ఈ సంఘాలను ఏర్పాటు చేస్తామని ఉత్తమ్ తెలిపారు.

జల వివాదాలపై పోరాటం, ప్రాజెక్టుల పునరుద్ధరణ
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి ఉద్ఘాటించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్న కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో బలంగా వాదిస్తామని, ఇందుకోసం సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయబద్ధమైన హక్కులపై రాజీ పడబోమన్నారు. అలాగే, తుమ్మిడిహట్టి ఆనకట్ట కోసం అవసరమైన సవరణలతో డీపీఆర్‌  సిద్ధం చేస్తామని, కేబినెట్ ఆమోదం తర్వాత ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు చేపడతామని ప్రకటించారు. చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి ప్రాజెక్టులపై కేబినెట్‌ పరిశీలనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేటీఆర్‌ విమర్శలకు దీటైన జవాబు
ప్రాజెక్టుల అంశంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇష్టారాజ్యంగా, రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌ తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్లలో నదీజలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని, కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

ధాన్యం సేకరణపై కేంద్రంతో చర్చలు
మంగళవారం దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలుస్తానని, 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని కోరతానని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని గోదాముల్లో, రైసు మిల్లుల్లో ధాన్యం నిండిపోయినందున, వాటిని తరలించడానికి 300 రైళ్లు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad