Telangana tourist safety initiative : సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్పెషల్ పోలీసులు.. ఇలా రకరకాల పోలీసుల గురించి మనకు తెలుసు. కానీ, ‘టూరిస్టు పోలీసుల’ గురించి ఎప్పుడైనా విన్నారా? చారిత్రక కట్టడాల వద్ద, పుణ్యక్షేత్రాల దగ్గర మనకు రక్షణ కల్పిస్తూ, గైడ్‌గానూ వ్యవహరించే ప్రత్యేక పోలీసు విభాగం మన రాష్ట్రంలోకి వచ్చేసింది. అసలు ఎవరీ టూరిస్టు పోలీసులు..? వారి విధులేంటి..? మనకు ఎలా సహాయపడతారు..? ఈ విధానం మన పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?
తెలంగాణకు వచ్చే పర్యాటకులకు, పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులకు మరింత భద్రతను, భరోసాను కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం “టూరిస్ట్ పోలీసింగ్” అనే వినూత్న విభాగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పోలీసు శాఖలో పనిచేస్తున్న సమర్థులైన సిబ్బందికి పర్యాటక ప్రదేశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని ఈ విధుల్లో నియమిస్తున్నారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, ఆయా ప్రదేశాల చరిత్ర, ప్రాముఖ్యతను పర్యాటకులకు వివరిస్తూ గైడ్‌లుగానూ వీరు సేవలందిస్తారు. ఈ సరికొత్త విధానం ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది సిబ్బంది సోమవారం నుంచి విధుల్లో చేరారు.
ఎంపిక, శిక్షణ ఇలా : ఈ ప్రత్యేక విధులకు పోలీసు శాఖ నుంచే సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, మేనేజ్‌మెంట్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన, తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల యువ పోలీసులను గుర్తించి వారిని ఈ విభాగానికి ఎంపిక చేస్తున్నారు.
శిక్షణ: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న ఈ విభాగంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఎంపిక చేసిన 80 మంది పోలీసులకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM)లో అక్టోబర్ 6 నుంచి 9 వరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
క్షేత్రస్థాయి పర్యటన: శిక్షణలో భాగంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో యాదగిరిగుట్ట, గోల్కొండ కోట, భువనగిరి కోట, లుంబినీ పార్క్, కుతుబ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలకు వారిని తీసుకెళ్లి క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు.
పర్యాటకులకు భరోసా: హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలకు నిత్యం వేల సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపుల కారణంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఈ టూరిస్టు పోలీసుల వ్యవస్థ పర్యాటకులకు గొప్ప భరోసాను ఇవ్వనుంది. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందించి, వారికి రక్షణగా నిలుస్తారు.
వరంగల్‌లోనూ త్వరలో సేవలు: చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ త్వరలో ఈ సేవలను విస్తరించనున్నారు. రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, లక్నవరం సరస్సు, ఖిలా వరంగల్, బొగత జలపాతం వంటి ప్రదేశాల్లో సరైన గైడ్‌ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 20-30 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేసి, వారికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చి ఇక్కడ నియమించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అంచెలంచెలుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ టూరిస్టు పోలీసింగ్ వ్యవస్థను విస్తరించనున్నారు.


