Used vehicle buying guide : కలలు కనే కళ్ళు.. వేగాన్ని కోరుకునే అడుగులు.. కానీ చేతిలో లేని డబ్బు.. కన్న కలలను దూరం చేస్తుంది. అప్పుడే వస్తుంది ఆ పాత వాహనం.. పాతబడ్డదైనా, కాలాన్ని జయించి నిలిచి ఉన్నా.. కొత్త ఆశలకు అది ఊపిరి పోస్తుంది. పెద్ద అండగా నిలిచి.. పేద, మధ్య తరగతి వారిని గమ్యానికి చేర్చే నేస్తం అది. కానీ, తక్కువ ధర అనే ఆశ… కొన్నిసార్లు తీరని కష్టాలను, చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతోంది. పాత వాహనం కొనేముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏ పత్రాలు సరిచూసుకోకపోతే నట్టేట మునిగిపోతారు.. ? ఈ దందాలో జరుగుతున్న మోసాలేంటి…? రవాణా శాఖ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
నెలనెలా రూ.45 కోట్ల దందా… అందులోనే మోసాల చిందా: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే నెలకు సుమారు రూ.45 కోట్ల విలువైన పాత వాహనాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయంటే ఈ మార్కెట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సగటున నెలకు 760 కార్లు, 940కి పైగా బైక్‌లు చేతులు మారుతున్నాయి. అయితే, ఈ భారీ వ్యాపారంలో అవగాహన లేని కొనుగోలుదారులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. కొందరైతే, ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీలు వసూలు చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు.
మోసాలెన్నో… మచ్చుకు కొన్ని..
దిల్లీ కారు… తిప్పలపాలు: కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దిల్లీ నుంచి తెచ్చిన కారును తక్కువ ధరకు కొన్నారు. తీరా చూస్తే, సరైన పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారులు నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తి లబోదిబోమంటున్నారు.
తప్పుడు పత్రాలు… జేబుకు చిల్లు: పెద్దపల్లికి చెందిన ఓ యువకుడు కొన్న పాత బైక్‌ను పోలీసులు తనిఖీ చేయగా, అవి తప్పుడు పత్రాలని తేలింది. అసలు యజమాని ఎవరో తెలియక, జరిమానా చెల్లించి బండిని విడిపించుకోవాల్సి వచ్చింది.
ఎలా మోసగిస్తున్నారు : ‘తక్కువ ధరకే బండి’ అనే ఆశే కొనుగోలుదారుల పాలిట శాపంగా మారుతోంది.
పత్రాల గారడీ: ధర తక్కువగా ఉందని ఆశపడితే, కొన్ని కీలక పత్రాలు లేకుండానే వాహనాన్ని అంటగట్టేస్తున్నారు.
ఆన్‌లైన్ మాయ: పత్రాలు చేతిలో ఉన్నా, ఆ వివరాలు ఆన్‌లైన్‌లోని ‘వాహన్’ పోర్టల్‌లో నమోదై ఉన్నాయో లేదో చూసుకోకుండా కొందరు కొనుగోలు చేసి చిక్కుల్లో పడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో ఈ బండారం బయటపడి, భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇలాంటి వాహనాలు రోజుకు సగటున 25కి పైగా పట్టుబడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
కొనేముందు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి : పాత వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే మోసపోయే ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మెకానిక్ పరీక్ష: అనుభవం ఉన్న మెకానిక్‌తో వాహనం ఇంజిన్ కండిషన్, విడిభాగాల నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయించాలి.
టెస్ట్ డ్రైవ్: వాహనాన్ని స్వయంగా నడిపి దాని పనితీరును, ఛాసిస్ నంబర్‌ను పరిశీలించాలి.
పత్రాల పరిశీలన: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలు అసలైనవో కాదో నిర్ధారించుకోవాలి.
చలానాల చరిత్ర: ఆ వాహనంపై ఏవైనా కేసులు, జరిమానాలు, చలానాలు పెండింగ్‌లో ఉన్నాయేమో ఆన్‌లైన్‌లో సరిచూసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే కొనుగోలు పత్రంపై సంతకం చేయాలి.
“పాత వాహనాల కొనుగోలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని పత్రాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలి. రిజిస్ట్రేషన్ బదిలీకి ముందు ఎంవీఐ అధికారులు వాహనం కండిషన్‌ను, పత్రాలను పరీక్షిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ‘వాహన్’ పోర్టల్‌లో పేరు మార్పిడి జరుగుతుంది.”
– రంగారావు, జిల్లా రవాణా అధికారి, పెద్దపల్లి.


