Wednesday, January 14, 2026
HomeతెలంగాణRegistration : ఇక ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లక్కర్లేదు.. షోరూంలోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్!

Registration : ఇక ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లక్కర్లేదు.. షోరూంలోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్!

Vehicle registration at dealerships in Telangana : కొత్త వాహనం కొన్నామన్న ఆనందం ఒకవైపు.. రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్న తలనొప్పి మరోవైపు! ఈ తిప్పలకు చెక్ పెడుతూ, తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు ఓ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇకపై కొత్త వ్యక్తిగత వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్  కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు వాహనం కొనుగోలు చేసిన షోరూం డీలర్ వద్దే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 

- Advertisement -

ప్రస్తుతం, కొత్త వాహనం కొన్నప్పుడు షోరూంలో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే చేస్తున్నారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం, వాహనాన్ని ఆర్టీఏ కార్యాలయానికి తీసుకెళ్లి, అధికారుల తనిఖీ తర్వాత ప్రక్రియ పూర్తి చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో, కార్యాలయాల్లో అవినీతి, జాప్యం జరుగుతోందని, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రవాణా శాఖ ఈ నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టింది.

కొత్త విధానం పనిచేసేదిలా  : ఈ కొత్త విధానం అమలు కోసం, రవాణా శాఖ 15 రోజుల్లోగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి సుమారు 6 నెలల సమయం పట్టవచ్చు.

డీలర్ వద్దే దరఖాస్తు: వాహన కొనుగోలుదారులు, అవసరమైన అన్ని పత్రాలను (ఇన్‌వాయిస్, ఫారం-21, 22, బీమా, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఫోటో మొదలైనవి) ఆన్‌లైన్‌లో డీలర్ ద్వారా అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ పరిశీలన: డీలర్ నుంచి వచ్చిన దరఖాస్తులను, రిజిస్టరింగ్ అథారిటీ (RTO/DTO) ఆన్‌లైన్‌లోనే పరిశీలించి, ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు.

ఇంటికే ఆర్సీ: రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రిజిస్ట్రేషన్ పత్రం (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారుడి ఇంటికే వస్తుంది. డీలర్ల వద్ద ఉన్న వాహనాల నిల్వలపై రవాణా శాఖ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసే అధికారం కలిగి ఉంటారు.

ప్రయోజనాలేంటి : ఈ కొత్త విధానం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరిగే సమయం, శ్రమ ఆదా అవుతుంది. మధ్యవర్తులు, లంచాల ప్రమేయం లేకుండా, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. డిజిటలైజేషన్ వల్ల, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ‘వాహన్’, ‘సారథి’ పోర్టళ్ల ద్వారా ఈ విధానం అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సంస్కరణను తీసుకురావడం, వాహనదారులకు ఎంతో ఊరటనిచ్చే విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News