Saturday, November 15, 2025
HomeతెలంగాణWater Rights War: బనకచర్ల చిచ్చు.. నీటి హక్కులపై మాటల మంటలు!

Water Rights War: బనకచర్ల చిచ్చు.. నీటి హక్కులపై మాటల మంటలు!

Telangana water rights dispute : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రం లేఖ రాసినా రేవంత్ సర్కారులో చలనం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శల దాడి చేయగా, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతేస్థాయిలో తిప్పికొట్టారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అసలు ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఏమని లేఖ రాసింది..? దానిపై హరీశ్‌రావు ఆరోపణలేంటి..? కాంగ్రెస్‌ ప్రభుత్వ వాదన ఏమిటి..?

- Advertisement -

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం, తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ వేడిని రాజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పరిశీలిస్తున్నామంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి 20 రోజులు గడుస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బలంగా స్పందిస్తూ, రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి రాజీకి తలొగ్గదని పునరుద్ఘాటించారు.

హరీశ్‌రావు ఘాటు విమర్శలు..
నిబంధనలను తుంగలో తొక్కి, కేంద్రం అండతో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకు వెళ్తుంటే, తెలంగాణలోని రేవంత్ సర్కారు పరోక్షంగా సహకరిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.

“కేంద్ర మంత్రి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తే స్పందించరా..? వరద జలాల వినియోగంపై ఇప్పటివరకు సరైన చట్టం లేదు. దీనిపై మీరు మౌనం వహిస్తున్నారంటే, పరోక్షంగా ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తున్నట్లే. మీకు కాంట్రాక్ట్‌లో ఏమైనా వాటా ఉందా? గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తే, ఎగువ రాష్ట్రంగా మనకూ వాటా ఉంటుంది. ఏపీ 463 టీఎంసీలు మళ్లిస్తే, మన వాటా ప్రకారం 112 టీఎంసీల నీటిని మనం కృష్ణా నదిలో నిలుపుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి స్వార్థం చూసుకోకూడదు,” అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.

ఉత్తమ్‌ అంతేస్థాయిలో తిప్పికొట్టారు : హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అబద్ధాలతో ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

“గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నిజమైన మోసం, అన్యాయం జరిగిందంటే అది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా రికార్డు స్థాయిలో వరి పంటకు అందించాం. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును కూడా అడ్డుకుని తీరతాం. తెలంగాణ నీటి హక్కుల విషయంలో చుక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తే లేదు. మా వాదనలను కేంద్రం, సుప్రీంకోర్టు ముందు సమర్థవంతంగా వినిపిస్తున్నాం,” అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించామని, త్వరలో సమ్మక్క-సారక్క బ్యారేజీకి కూడా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad