Weather Forecast updates: రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, అల్పపీడనాలు ‘మొంథా’ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. దీంతో అనేక జిల్లాల్లో వరదలు, పంట నష్టం సంభవించాయి. వర్షాకాలం ముగిసినా.. అకాల వర్షాలు కురువడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చేతికచ్చిన పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు వాతావరణం ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండడంతోనే రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఉత్తర తమిళనాడు తీర పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వివరించింది. దీని ప్రభావం సైతం రాష్ట్ర వాతావరణ మార్పులకు కారణమని అన్నారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/today-andhra-pradesh-weather-forecast-updates/
పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: నేడు నాగర్ కర్నూల్, వికారాబాద్,నల్లగొండ, , సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని అన్నారు. వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు. మిగితా జిల్లాల్లో పెద్దగా వర్షాల ప్రభావం ఏమీ లేదని అన్నారు. అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. అయినప్పటికీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


