తెలంగాణ (Telangana)లో చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గడిచిన రెండు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రం లోనే అత్యల్పంగా సిర్పూర్ 10.5 డిగ్రీల సెల్సియస్, పొచ్చెర 11.8 డిగ్రీల సెల్సియస్, కుంటాల 12.6, ర్యాలీ 13.1 డిగ్రీల సెల్సియస్ చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్ నెలలోనే మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ఆరు జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడి పోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పెద్దపల్లి, మంచిర్యాల, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు.