Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana Handloom Sector: పట్టు వీడని పడుగు పేకలు... అక్షరమెరుగని చేతులతో అద్భుతాలు!

Telangana Handloom Sector: పట్టు వీడని పడుగు పేకలు… అక్షరమెరుగని చేతులతో అద్భుతాలు!

Telangana Women Weavers: అక్షరాల ప్రపంచం వారికి తెలియదు. కానీ ప్రకృతి ఒడిలో అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నారు. ప్రకృతిలోని గడ్డిపోచల అల్లికను పరిశీలించి, పడుగు పేకల సూత్రాన్ని కనిపెట్టి లోకానికి కొత్త దారి చూపారు. మగ్గం గుంతలో కూర్చుని, దారానికి ప్రాణం పోసి, మానవ ప్రపంచానికి వస్త్రాలను అందిస్తున్న ఈ మహిళల జీవితాల్లోని ముడులు మాత్రం వీడటం లేదు. ఆశించిన ఆర్థిక ఆదరణ లేకపోయినా, కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఈ చేనేత యోధుల కథలేంటి..? కష్టాల కడలిలో వారు పడుతున్న ఆవేదన ఏమిటి..? సంప్రదాయ కళకు ఆధునికతను జోడించి వారు చేస్తున్న ప్రయోగాలేంటి..? 

- Advertisement -

ఒడిదొడుకులమయమే వారి జీవితం: చేనేత కళ వారి రక్తంలోనే ఉంది. కానీ ఆ కళ వారి కడుపు నింపలేకపోతోంది. అయినా సరే, వేరే పని రాక, తరతరాలుగా వస్తున్న వృత్తిపై మమకారం చంపుకోలేక మగ్గాన్నే అంటిపెట్టుకుని జీవిస్తున్నారు తెలంగాణలోని ఎందరో మహిళలు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ, వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త డిజైన్లతో వస్త్రాలు నేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వారి పట్టుదల వెనుక కన్నీటి గాథలెన్నో…

భర్తకు చేదోడుగా అనసూర్య: చండూరుకు చెందిన 60 ఏళ్ల రాపోలు అనసూర్య గత 15 ఏళ్లుగా భర్త లక్ష్మీనారాయణకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సాగుభూమి లేకపోవడంతో చేనేతనే జీవనాధారంగా ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే వచ్చేది కేవలం రూ.400. అయినా ఆ కళను వీడలేదు.

ఒంటరి పోరాటం చేస్తున్న అరుణ: 23 ఏళ్ల కిందట భర్తను కోల్పోయిన చెరుపల్లి అరుణ (60)కు మగ్గమే పెద్ద దిక్కయింది. మొదట్లో రంగులు అద్దడం, చిటికీలు కట్టడం వంటి పనులు చేసినా, కుటుంబం గడవడం కష్టం కావడంతో మగ్గం నేయడం నేర్చుకున్నారు. గత 22 ఏళ్లుగా ఒకే మాస్టర్‌ వీవర్‌ దగ్గర పనిచేస్తూ రోజుకు రూ.500 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

కుటుంబానికి పెద్దదిక్కైన కరుణ: గట్టుప్పలకు చెందిన సూరపెల్లి కరుణ జీవితం మరో విషాద గాథ. భర్త మానసిక అనారోగ్యంతో కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో, ఇద్దరు పిల్లల భారం ఆమెపై పడింది. కులవృత్తే తనను కాపాడుతుందని నమ్మి, మగ్గం ఎక్కి, పిల్లలను చదివిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంప్రదాయానికి ఆధునికత మేళవింపు: సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో, ఈ కార్మికులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ‘లినెన్‌’ నూలుతో చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్, ధోతీలు, యువత మెచ్చే చొక్కాలు తయారు చేస్తూ మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

విదేశీ వస్త్రం… మన చేతుల్లో ప్రాణం: అవిసె (ఫ్లాక్స్‌) మొక్క కాండం నుంచి తీసిన నారతో తయారుచేసేదే లినెన్ వస్త్రం. అమెరికా, బెల్జియం, చైనా వంటి దేశాల్లో 80 శాతం మంది ఈ వస్త్రాలనే వినియోగిస్తారు. ధర ఎక్కువ కావడంతో మన దేశంలో ఒకప్పుడు ఉన్నత వర్గాలకే పరిమితమైన ఈ వస్త్రం, ఇప్పుడు మన చేనేత కార్మికుల నైపుణ్యంతో కొత్త రూపాలను సంతరించుకుంటోంది. ఎండాకాలం చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం, చెమటను త్వరగా పీల్చుకోవడం వంటి ప్రత్యేకతల వల్ల లినెన్‌కు ఆదరణ పెరుగుతోంది. అక్షరం ముక్క రాని ఈ మహిళలు, అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad