Youth tattoo culture in Telangana : ఒకప్పుడు చెరిగిపోని జ్ఞాపకాలకు, చెరగని భక్తికి ప్రతీకగా నిలిచిన పచ్చబొట్టు, నేడు ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సరికొత్త సంచలనం. ఇష్టమైన వారి పేర్ల స్థానంలో ఇప్పుడు అభిమాన తారల చిత్రాలు, ఆధ్యాత్మిక చిహ్నాలు, అధునాతన డిజైన్లు దేహాన్ని అలంకరిస్తున్నాయి. అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనిపించాలన్న నేటి యువతరం తపన, పచ్చబొట్టు సంస్కృతికి కొత్త ఊపిరిలూదుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ నయా ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర కోణాలేమిటి? ఈ ఫ్యాషన్ పరుగులో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తున్నారా?
ఫ్యాషన్ వెంట పరుగులు.. దేహంపై చిత్రాల హొయలు : మారుతున్న కాలానికి అనుగుణంగా యువత అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. ఇందులో భాగంగానే పచ్చబొట్టు సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వందలాదిగా టాటూ కేంద్రాలు వెలుస్తుండటమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ ట్రెండ్‌ను ఎక్కువగా అనుసరిస్తున్నారు.
డిజైన్లలొ వైవిధ్యం: ప్రేమికులు తమ బంధం ఇతరులకు తెలియకుండా ఉండేందుకు ముద్దు పేర్లను, రోమన్ అక్షరాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తూ హనుమంతుడు, త్రిశూలం, గద్ద, ఛత్రపతి శివాజీ, గౌతమబుద్ధుడు వంటి చిత్రాలను అరచేయి, గుండెలపై పొడిపించుకుంటున్నారు. అమ్మ, నాన్నల మీద ప్రేమను చాటుకునేందుకు వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకోవడం మరో ట్రెండ్.
అమ్మాయిలూ సై: ఈ విషయంలో అమ్మాయిలు కూడా ఏమాత్రం వెనకబడటం లేదు. నుదురు, బుగ్గలు, దవడ వంటి సున్నితమైన భాగాలపై చిన్నపాటి ఆకర్షణీయమైన పచ్చబొట్లతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఉపాధి మార్గం.. ధరల మోత : పెరుగుతున్న డిమాండ్, యువతలో ఈ రంగంపై ఉన్న ఆసక్తి దీన్నో మంచి ఉపాధి మార్గంగా మార్చింది.
ధరల నిర్ణయం: పచ్చబొట్టు డిజైన్, దాని పరిమాణాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. అంగుళం సైజు బొమ్మ వేయాలంటే కనీసం రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. అదే గౌతమబుద్ధుడి వంటి పెద్ద సైజు చిత్రం వేయించుకోవాలంటే సుమారు రూ. 10,000 వరకు ఖర్చవుతోంది.
ఆదాయం: అయినా యువత వెనకడుగు వేయడం లేదు. ఒక్కో దుకాణానికి రోజుకు ముగ్గురు, నలుగురు కస్టమర్లు వస్తున్నారని, దీని ద్వారా నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఆదాయం వస్తోందని వనపర్తికి చెందిన ఓ టాటూ కేంద్రం నిర్వాహకుడు తెలిపారు.
ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం: ఫ్యాషన్ మోజులో పడి ఆరోగ్యాన్ని విస్మరించవద్దని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు హెచ్చరిస్తున్నారు. పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
పచ్చబొట్టు వేసుకునేటప్పుడు ఆధునిక, సురక్షితమైన పద్ధతులు పాటించాలి. నిర్వాహకులు ప్రతి ఒక్కరికీ కొత్త సూదుల్నే వినియోగించాలి, నాణ్యమైన రంగులనే వాడాలి. కొంతమంది పాత డిజైన్లను తొలగించుకోవడానికి లేజర్ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా పదేపదే చేయడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.


