Sunday, November 16, 2025
HomeతెలంగాణLinen Weaving: చేనేతకు 'లినెన్' కళ.. వినియోగదారులకు సరికొత్త వల!

Linen Weaving: చేనేతకు ‘లినెన్’ కళ.. వినియోగదారులకు సరికొత్త వల!

Linen handloom trend : సంప్రదాయ చేనేత వస్త్రాలు కనుమరుగవుతున్నాయా? నేతన్నల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయా..? ఈ ప్రశ్నలకు సమాధానంగా తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికులు సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘లినెన్’ వస్త్రాన్ని మన మగ్గాలపై ఆవిష్కరిస్తూ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటున్నారు. అసలు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఈ ‘లినెన్’ మన చేనేత కార్మికులకు కొత్త దారి ఎలా చూపుతోంది.? దీని ప్రత్యేకతలేంటి..?

- Advertisement -

కాలంతో పాటు మారని సంప్రదాయ చేనేత వస్త్రాలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. వినియోగదారులు కొత్తదనాన్ని కోరుకుంటుండటంతో, మన నేతన్నలు నేసిన వస్త్రాలు నిల్వలుగా పేరుకుపోతున్నాయి. ఈ గడ్డు కాలాన్ని అధిగమించి, తమ వృత్తిని కాపాడుకోవడానికి చేనేత కార్మికులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ‘లినెన్’ నూలుతో వస్త్రాల తయారీ.

అసలేంటీ ‘లినెన్’ కథ : అవిసె (ఫ్లాక్స్) మొక్క కాండం నుంచి సేకరించిన నారతో తయారు చేసే నూలునే ‘లినెన్’ అంటారు. ఈ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అమెరికా, చైనా, ఇటలీ, బెల్జియం వంటి దేశాల్లో 80 శాతం మంది ప్రజలు వీటినే ధరిస్తారు.

ప్రత్యేకతలు: వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం లినెన్ యొక్క ప్రధాన లక్షణం. ఇది చెమటను వేగంగా పీల్చుకుని, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాదు, ఎన్నిసార్లు ఉతికినా దీని మెరుపు తగ్గకపోవడం మరో విశేషం.

దిగుమతి నూలు… దేశీయ నైపుణ్యం : ఇంతకాలం మన వ్యాపారులు విదేశాల నుంచి నేరుగా లినెన్ వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు. దీంతో వాటి ధర సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత సహకార సంఘాలు నేరుగా ‘లినెన్’ నూలును దిగుమతి చేసుకుంటున్నాయి. ఆ నూలుకు మన నేతన్నల నైపుణ్యాన్ని జోడించి, దేశీయ మగ్గాలపై అద్భుతమైన వస్త్రాలను సృష్టిస్తున్నారు.

మన అభిరుచికి తగ్గట్టుగా : విదేశాల్లో యంత్రాలపై తయారయ్యే లినెన్ వస్త్రాలు సాధారణంగా ఒకే రంగులో, పరిమిత డిజైన్లతో ఉంటాయి. కానీ, మన నేతన్నలు వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా ఆ నూలుకు ఆకర్షణీయమైన రంగులు అద్దుతున్నారు. చీరలపై అందమైన ఎంబ్రాయిడరీ, సరికొత్త డిజైన్లతో కనువిందు చేస్తున్నారు. తెలంగాణలోని దుబ్బాక, పోచంపల్లి, సిరిసిల్ల, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి వంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రత్యేక బ్రాండ్లతో లినెన్ చీరలు, చొక్కాలు, డ్రెస్ మెటీరియల్స్ తయారు చేస్తున్నారు. విదేశీ ఉత్పత్తులతో పోలిస్తే ధరలు అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రభుత్వం చేయూతనిస్తే : ఈ కొత్త ప్రయోగంపై దుబ్బాక చేనేత ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బోడ శ్రీనివాస్ మాట్లాడుతూ, “వందశాతం స్వచ్ఛమైన లినెన్‌తో మగ్గాలపై వస్త్రాలను రూపొందిస్తున్నాం. ఎలాంటి రసాయనాలు వాడటం లేదు. మా వద్ద సుమారు 50 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వారానికి 100 చీరల వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ప్రభుత్వం మూలధనం సమకూర్చి, ప్రభుత్వ చేనేత దుకాణాల్లో మా ఉత్పత్తులను విక్రయించడానికి ముందుకు వస్తే, ఈ పరిశ్రమను మరింత విస్తృతం చేసి, ఎంతో మందికి ఉపాధి కల్పించగలం” అని ఆశాభావం వ్యక్తం చేశారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad