Temples closed due to lunar eclipse : ఆకాశంలో చంద్రుడికి గ్రహణం పడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు తాళాలు పడుతున్నాయి. శాస్త్ర నియమానుసారం, చంద్రగ్రహణం కారణంగా తిరుమల నుంచి యాదాద్రి వరకు, భద్రాచలం నుంచి శ్రీశైలం వరకు అన్ని ప్రధాన దేవాలయాలు నేటి మధ్యాహ్నం నుంచి మూతపడనున్నాయి. భక్తులకు దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఇంతకీ ఏ ఆలయాన్ని ఏ సమయానికి మూసివేస్తున్నారు..? తిరిగి ఎప్పుడు తెరుస్తారు..? గ్రహణ సమయంలో భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలేంటి..?
మధ్యాహ్నానికే ద్వారబంధనం : చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయాలని దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఉదయం పూట జరిగే నిత్య కైంకర్యాలు, నివేదనలు పూర్తి చేసి, మధ్యాహ్నానికల్లా ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. సోమవారం ఉదయం గ్రహణం వీడిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ప్రధాన ఆలయాల్లో వేళలు ఇలా..
తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమలలో నేటి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం 1:30 గంటలకే దర్శనాలను నిలిపివేస్తున్నామని, అన్నప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 50 వేల పులిహోర ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. సోమవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, శుద్ధి, సుప్రభాత సేవ అనంతరం దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో మధ్యాహ్నం 12 గంటలకే ఆలయ ద్వారబంధనం చేయనున్నారు. అంతకుముందే, ఉదయం 8:30 నుంచి 12 గంటల లోపు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం కారణంగా మధ్యాహ్నం, సాయంత్రం జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలను రద్దు చేశారు.
ఇతర ఆలయాలు: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని మధ్యాహ్నం 1 గంటకు, వేయిస్తంభాల గుడిని 12 గంటలకు మూసివేయనున్నారు. ప్రసిద్ధ రామప్ప ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాలను కూడా మధ్యాహ్నం 12-1 గంటల మధ్య మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
గ్రహణ వేళ.. పాటించాల్సిన నియమాలు : గ్రహణ సమయంలో ఆహార నియమాలు పాటించాలని, కొన్ని పనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ప్రముఖ పండితులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ప్రకారం, గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచే భోజనం చేయడం మానాలి (గ్రహణ వేధ). ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడేవారు మినహా మిగిలిన వారు ఉపవాసం ఉండటం మంచిది.గ్రహణ సమయంలో ప్రయాణాలు, ముఖ్యమైన ఒప్పందాలు, పూజా కార్యక్రమాలు వంటివి వాయిదా వేసుకోవడం ఉత్తమం.గ్రహణ కిరణాల ప్రభావం పడకుండా ఇంట్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పచ్చళ్లు, తాగునీటిపై దర్భలను ఉంచడం మన సనాతన సంప్రదాయం.


