ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాటేపల్లి వెంకటరమణారెడ్డి నీ పోలీసుల శుక్రవారం విడుదల చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, వెంకట రమణారెడ్డిని పరామర్శించడానికి వస్తున్న సందర్భంలో పెద్ద కొడపగల్ వద్ద పోలీసులు బిచ్కుందకు రాకుండా నిర్బంధించారు. దానితో ఆగ్రహం వ్యక్తం చేసిన రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్టు చేయడం ఏమిటని, నాయకులని ఎన్ని పోలీస్ స్టేషన్లో నిర్భందిస్తారని వెంటనే వారిని విడిచి పెట్టకపోయినట్టయితే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వస్తారని హెచ్చరించడంతో పోలీసులు దిగివచ్చి, జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి వెంకటరమణారెడ్డిని విడిచిపెడతామని చెప్పడంతో శాంతించారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో విడుదల అనంతరం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ఒకవేళ అభివృద్ధి చెందితే భాజపా కార్యకర్తలు ఆ ప్రదేశాల్లో చూసి వస్తామని అంటే కెసిఆర్ కు, ప్రభుత్వానికి భయం ఎందుకని, బిజెపి అంటేనే కెసిఆర్ కి భయం పట్టుకుందని, గజ్వేల్ లో అభివృద్ధి చేయని కెసిఆర్, కామారెడ్డికి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.
కేసిఆర్ అనుచరులు ప్రజలపై చేసిన దౌర్జన్యాలు ప్రజలకు తెలవద్దని ఉద్దేశంతోనే అక్రమంగా పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేసి అనేక పోలీస్ స్టేషన్లో దింపుతూ చివరగా బిచ్కుంద పోలీస్ స్టేషన్ కి తరలించారని ఆయన అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తే ఎన్ని పోలీస్ స్టేషన్లో నింపుతారో నింపుకొండని దానికి భాజపా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పోలీసులు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని అడ్డంకులు ఏర్పాటుచేసిన కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడం పక్క అని ఆయన అన్నారు. గజ్వేల్ లో ఓడిపోతారని ఉద్దేశంతోనే, కామారెడ్డిలో నిలబడుతున్నారని ఆయన అన్నారు .ప్రభుత్వ భూములను కాజేయడానికి కెసిఆర్ కూతురు కవిత, మరియు వారి గణం కెసిఆర్ ని కామారెడ్డి నిలబెడుతున్నారని ఆరోపించారు. గజ్వేల్ ని పక్కా సందర్శిస్తామని ఎన్నిసార్లు అరెస్టు చేసుకుంటారో చేసుకోండి అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్యాద్రి రెడ్డి, మండలాలకి చెందిన అధ్యక్ష ,కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.