ములుగు జిల్లా (Mulugu District)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీక్షా దివస్ నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్ కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా జెండాలు పెట్టారనే కారణంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ములుగు (Mulugu) గ్రామపంచాయతీ సిబ్బందికి, పార్టీ నాయకులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ జెండాలు కేసీఆర్ ఫోటోలు తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.