Telangana Congress ministers internal conflict : ప్రభుత్వం పాలనను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తుంటే, కొందరు మంత్రులు మాత్రం కయ్యాలతో కాలాన్ని, పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ అధిష్ఠానానికి తలనొప్పిగా మారుతున్నాయి. అసలు ఈ మంత్రులకు ఏమైంది..? వారి మధ్య అగాధం ఎందుకు పెరుగుతోంది..? వ్యక్తిగత అహంకారాలా లేక వర్గపోరా? ఈ పంచాయితీలతో ప్రభుత్వానికి, పార్టీకి జరుగుతున్న నష్టమెంత..?
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాలనను గాడిలో పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో, మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఈ పరిణామాలు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా, కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
ఒకరిపై ఒకరు.. బాహాటంగానే విమర్శలు..
పొన్నం వర్సెస్ అడ్లూరి: ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఈ వివాదం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మారడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఇద్దరినీ తన ఇంటికి పిలిపించి రాజీ కుదిర్చినా, తన తప్పేమీ లేకపోయినా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని మంత్రి పొన్నం తీవ్ర మనోవేదనతో ఉన్నట్లు సమాచారం.
అడ్లూరి వర్సెస్ వివేక్: ఈ వ్యవహారం చల్లారకముందే, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్ వెంకటస్వామిల మధ్య విభేదాలు బయటపడ్డాయి. “తాను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతారు” అంటూ అడ్లూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనికి వివేక్ స్పందిస్తూ, తాను అలాంటి వ్యక్తిని కానని, అడ్లూరి రాజకీయ ఎదుగుదలకు తన కుటుంబం ఎంతగా సహకరించిందో గుర్తుచేశారు. ఈ ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం వారి మధ్య సఖ్యత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
వరంగల్‌లో మంత్రి వర్సెస్ మంత్రి: పొన్నం, అడ్లూరి, వివేక్‌ల పంచాయితీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారితే, ఉమ్మడి వరంగల్‌లో మరో ఇద్దరు మంత్రుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది.
పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.71 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొంగులేటి తన అనుచరులకు ఇప్పించుకున్నారని, దేవాదాయ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ వర్గం ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫిర్యాదు చేసింది. దీనికితోడు, ఇటీవల జరిగిన మేడారం పనుల సమీక్షకు మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం ఈ విభేదాలను మరింత స్పష్టం చేసింది.
ఓఎస్డీపై వేటు: ఈ వివాదంలో కీలక పరిణామం మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్‌పై వేటు పడటం. సుమంత్, మంత్రి సురేఖకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగింపజేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన వద్ద పనిచేస్తున్న అధికారిని తొలగించడంపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో పాటు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఇష్టారీతిన మాట్లాడుతూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం జోక్యం చేసుకుని, ఈ మంత్రుల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించకపోతే, ప్రభుత్వానికి, పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.


